సాయం చేసి న్యాయం అంటారా ? మీ కూతురికే ఇలా జరిగితే .. సీఎం జగన్ కు, డీజీపీకి అనిత సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడవారిపై పెరుగుతున్న అకృత్యాలు వైసిపి ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణం అంటూ టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలా జరిగితే 10 లక్షల పరిహారం తీసుకుని సైలెంట్ గా ఉంటారా ? లేక నేరస్తులకు శిక్ష పడాలని పోరాటం చేస్తారా? చెప్పాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి , డీజీపీ గౌతమ్ సవాంగ్ కి సూటి ప్రశ్న వేశారు వంగలపూడి అనిత. సాయం చేసి న్యాయం అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై ఇన్ని దారుణ సంఘటనలు జరుగుతున్నా పట్టించుకోని అసమర్థ ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి ఏపీకి అవసరమా అంటూ అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా నిత్యం అనేక చోట్ల దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నా,అరికట్టలేని ప్రభుత్వం ఏం చేస్తుందని అనిత ప్రశ్నించారు.

నేరాల్లో ఏపీ మొదటి స్థానం .. జగన్ రిజైన్ చెయ్యాలి
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ పాలనలో 2014 నుండి 2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్ గా రాష్ట్రం పరుగులు పెడితే ప్రస్తుతం వైసిపి హయాంలో రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిందని వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు. 2019 నుంచి అరాచక ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. జాతీయ నేరాల నమోదు బ్యూరో ఇచ్చిన తాజా నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం పోలీస్ వ్యవస్థ, హోమ్ మినిస్టర్ సిగ్గుపడాల్సిన అంశమని, జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయాలని టిడిపి నేత వంగలపూడి అనిత విమర్శించారు. ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులను అడ్డుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి ఏపీకి అవసరమా అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు.

జగన్ అసమర్ధ పాలన వల్లే ఏపీలో నేరాల పెరుగుదల
మానవ అక్రమ రవాణాలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రెండవ స్థానంలో ఉందని, ఇది రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడాల్సిన అంశమని అనిత పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రాష్ట్రం నేరాలకు పుట్టినిల్లుగా మారిందని అనిత విమర్శించారు. ఒకటి లేదా రెండు సంఘటనలు జరిగితే యాదృచ్ఛికంగా జరిగాయని అనుకోవచ్చని, కానీ వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే వీటికి అడ్డుకట్ట వేయటానికి ఎందుకు ఇప్పటివరకు ప్రణాళికలు సిద్ధం చేయలేదని అనిత ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఎందుకు వీటిపై రివ్యూ చేయడం లేదని నిలదీశారు. మహిళా రక్షణ కోసం ఎన్నో చట్టాలు చేశామని, దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించామని, అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, మహిళా రక్షణ కోసం ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందో చెప్పాలని ప్రశ్నించారు వంగలపూడి అనిత.

నిత్యం బాలికలు , మహిళలపై అత్యాచారాలు, దాడులు
మొన్నటికి మొన్న గుంటూరులో వివాహానికి హాజరై భర్తతో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో దుండగులు దాడి చేసి మహిళను పంట పొలాల్లోకి లాక్కెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడితే, కనీసం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయని పరిస్థితి దేనికి సంకేతం అని ప్రశ్నించారు అనిత. రమ్య హత్యోదంతం సమయంలో నారా లోకేష్ రాష్ట్రంలో అప్పటివరకు 517 సంఘటనలు జరిగాయని చెప్పారని, ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పూడిమడక గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికలపై తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి అత్యాచారానికి పాల్పడితే వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, రాష్ట్రంలో బాలికలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయని, ఇంత జరుగుతుంటే జగన్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు అనిత.

నెల్లూరులో యువతిపై దాడి .. ప్రభుత్వం ఉదాసేనత వల్లే పెరుగుతున్న దాడులు
నెల్లూరు జిల్లాలో ఓ కామాంధుడు వీడియో తీసి మరీ ఒక మహిళను వేధిస్తే, ఇష్టారాజ్యంగా దాడి చేస్తూ వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకొస్తుంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది అర్థం చేసుకోవచ్చని అనిత పేర్కొన్నారు. బహిరంగంగా వీడియో తీసి మరీ దాడులు చేస్తున్నారంటే ప్రభుత్వ ఉదాసీనత వల్ల కాదా అని ప్రశ్నించారు అనిత. వైయస్సార్సిపి కార్యకర్తలు, వైయస్సార్సిపి వాలంటీర్లు ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నా జగన్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని విమర్శించారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా జగన్ సైలెంట్ గా ఉన్నారని అనిత విమర్శించారు. జగన్ ఉదాసీన వైఖరి రాష్ట్రంలో తాజా పరిస్థితులకు కారణం అన్నారు అనిత .

మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలా జరిగితే మీ స్పందన ఇలాగే ఉంటుందా ?
ఇంతగా ఆడపిల్లలపై దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి పది లక్షల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అని విమర్శించారు. జగన్ తన ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే ఇలాగే స్పందిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇదే ప్రశ్న డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కూడా వేస్తున్నానని మీ ఇంట్లో ఆడపిల్లకే అన్యాయం జరిగితే ఇలాగే స్పందిస్తారా ? అని ప్రశ్నించారు. ఐదెకరాల పొలం ఇచ్చి, ఇంట్లో మరో ఆడపిల్లకు ఉద్యోగం ఇచ్చి, 10 లక్షల పరిహారం ఇస్తే న్యాయం చేసినట్లు ఎలా అవుతుంది అంటూ వంగలపూడి అనిత జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

దిశా చట్టం ఒక బూటకం .. టీడీపీ నేతలపై పెట్టే దృష్టి శాంతి భద్రతలపై పెట్టండి
దిశా చట్టం ఒక బూటకమని, రాష్ట్రంలో దిశా చట్టమే అమలులో లేనప్పుడు, దిశ చట్టం పై సీఎం జగన్ మోహన్ రెడ్డి రివ్యూ చేయడం మరో బూటకమని అనిత ధ్వజమెత్తారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను అడ్డుకోవడంపై, తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టడంపై, రాష్ట్రంలో లోకేష్ చేస్తున్న పర్యటనలు అడ్డుకోవడంపై, పరామర్శలు ఆపటంపై పెట్టే దృష్టి, శాంతిభద్రతలను పరిరక్షించడంలో, మహిళలు బాలికల మాన ప్రాణాలను రక్షించడంలో దృష్టిపెట్టాలని వంగలపూడి అనిత హితవుపలికారు.
రక్షించలేకుంటే రాజీనామా చెయ్యండి .. ఇలా దాడులు కొనసాగితే పెద్ద ఎత్తున మహిళా ఉద్యమం
మహిళలు, బాలికలను రక్షించడం చేతకాకపోతే రాజీనామాలు చేసి వైదొలగాలని పేర్కొన్నారు. మహిళలపై, బాలికలపై దాడుల ఘటనలు ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టే పరిస్థితి ఉంటుందని అనిత హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలు, బాలికల రక్షణపై దృష్టి పెట్టాలని అనిత విజ్ఞప్తి చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications