టీడీపీతో టచ్ లో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు - వస్తామంటున్నారు..!!
వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారా. వారంతా తమ పార్టీలోకి వస్తామంటున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ 41 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. ఏపీలో తిరిగి అధికారంలోకి రావటం ఇప్పుడు టీడీపీ ప్రధాన లక్ష్యం. ఇందు కోసం ఇప్పటికే కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును అనుకూలంగా మలచుకొనేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురే కాదని..40 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టత ఇచ్చారు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్లాలనేదే తమ విధానపరమైన నిర్ణయమని అచ్చెన్న చెప్పుకొచ్చారు. పొత్తులపై పార్టీ అధినేత చంద్రబాబు చర్చించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇదే సమయంలో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల గురించి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీకి ఓట్లు వేసిన అభ్యర్దులు ఎవరో వైసీపీ నేతలు చూసారా అని ప్రశ్నించారు. జగనే ఆత్మప్రభోదానుసారం టీడీపీ అభ్యర్ధికి ఓటు వేసారేమో అని వ్యాఖ్యానించారు.

ఏ అభ్యర్దికి ఎవరు ఓటు వేసారో తమకు తెలుసని ఎవరైనా అంటే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అచ్చెన్న డిమాండ్ చేసారు. ఎవరు ఎవరికి ఓటు వేశారో చెప్పటం అంటే రహస్య బ్యాలెట్ స్పూర్తిని ఉల్లంఘించటమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించటాన్ని తొందరపాటు చర్యగా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఒక కోర్టు తీర్పు చెప్పాక.. పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. తొందరపడి నిర్ణయం తీసుకోవటం సరికాదని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. తాము ప్రత్యేక హోదా కోసమే అప్పట్లో కేంద్రం నుంచి బయటకు వచ్చామని అచ్చెన్నాయుడు గుర్తు చేసారు.












Click it and Unblock the Notifications