ఉమ్మడి పౌరస్మృతిపై టీడీపీ యూటర్న్ ? నితీష్ ఝలక్ వేళ ..!
2029 నాటికి దేశంలోని 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని (UCC) అమలు చేసి తీరుతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది. ఇందులో 17 రాష్ట్రాల్లో బీజేపీ నేరుగా అధికారంలో ఉండగా.. మరో నాలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు సీఎంలుగా ఉన్నారు. అలాగే కేంద్రంలో బీజేపీకి కీలక మిత్రపక్షాలుగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూ(Jd(u), చంద్రబాబు టీడీపీ (TDP) వంటి పార్టీలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిని ఒప్పించకుండా అమిత్ షా కానీ, కేంద్రం కానీ ముందుకెళ్లలేని పరిస్ధితి.
అమిత్ షా యూసీసీ మీద ప్రకటన చేసిన తర్వాత గతంలో పార్లమెంట్ లో దీనిపై ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతిచ్చిన మిత్రపక్షం జేడీయూ యూటర్న్ తీసుకుంది. బీహార్ లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనివ్వబోమని ప్రకటించింది. దీంతో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బీహార్ లో తాజాగా నితీష్ కుమార్ స్ధానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత సామ్రాట్ చౌదరి సాయంతో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో.. జేడీయూ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దీని తర్వాత కేంద్రానికి మరో కీలక మిత్రపక్షం టీడీపీ కూడా స్పందించింది.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి చర్చా జరగలేదన్నారు. కానీ అవసరమని భావించినప్పుడు దీనిని పరిశీలిస్తామన్నారు. దీనిని ఆమోదించే ముందు వివిధ వర్గాల వారిని తప్పక సంప్రదిస్తామన్నారు. లావు వ్యాఖ్యలు.. టీడీపీ గత వైఖరికి భిన్నంగా ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయే లో చేరడానికి ముందు, యూసీసీ విషయంలో టీడీపీ ముస్లిం వర్గానికి అండగా నిలుస్తుందని టీడీపీ అధినేత తేల్చిచెప్పారు. కానీ మారిన పరిస్దితుల్లో టీడీపీ ఈ సున్నితమైన అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.














Click it and Unblock the Notifications
