రూటు మార్చిన టీడీపీ: వైఎస్ జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నేతలంతా ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒక పార్టీపై మరోపార్టీ పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు తీవ్రస్థాయిలో రచించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు పోటీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో వైసీపీ ప్రభుత్వం బస్సు యాత్ర నిర్వహింపచేసింది.
తాజాగా రెండురోజులపాటు వైసీపీ ప్లీనరీ జరిగింది. దానికి పోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలోని జిల్లాల్లో పర్యటించారు. మహానాడు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమనేది ప్రభుత్వ ఎత్తుగడగా ఉంటే.. ప్లీనరీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బాబు జిల్లాల పర్యటన సాగిందని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్లీనరీకి భారీస్థాయిలో పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. అలాగే చంద్రబాబు రోడ్ షోలకు ప్రజలు వెల్లువలా వచ్చారు.
కుప్పంలో బాబును ఓడించాలనే పట్టుదలతో వైసీపీ ఉండగా, ఏకంగా రాయలసీమ మొత్తం టీడీపీ కైవసం అయ్యేలా ఉండాలనే లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజల దృష్టిని మళ్లించేలా ఆ పార్టీ వ్యూహాలు ఉండేవి. వీటిని ఏనాడూ సీరియస్‌గా తీసుకోని టీడీపీ రానురాను తాను కూడా ఆవైపే ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకు ఉదాహరణే తాజా జిల్లాల పర్యటన. పోక చెక్కతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేను రెండంటా.. అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు టీడీపీ వైపు నుంచి ఈ తరహా ప్రతిఘటన చూడని వైసీపీ ఇకనుంచి మరింత పదునుగా ఉండేలా వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయమే ఉండటతో రాబోయే రోజుల్ల ఈ రెండు పార్టీల మధ్య పోరు పతాకస్థాయికి చేరుతుందని భావించవచ్చు.












Click it and Unblock the Notifications