టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినవారే నన్ను టార్గెట్ చేస్తున్నారు: మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాజకీయాలలో వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రసవత్తర రాజకీయం కొనసాగుతుంది. దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా కడియం శ్రీహరిపైన ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి కొండా సురేఖ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి, ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.
కడియం శ్రీహరిపై విరుచుకుపడిన మంత్రి కొండా సురేఖ
ఆ తర్వాత మంత్రి కొండా సురేఖను పరోక్షంగా టార్గెట్ చేసిన కడియం శ్రీహరి కొందరు కాంట్రవర్సీలు చేస్తూనే ప్రజల మధ్యలో ఉండాలని అనుకుంటారని సెటైర్లు వేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖా కార్యాలయంలో ఎమ్మెల్యేలు నేరుగా సమీక్షలు నిర్వహించటం ప్రభుత్వ ప్రోటోకాల్ ను అతిక్రమించటం అని ఆమె ఆరోపించారు.

కడియం శ్రీహరి తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్న మంత్రి
ఇలాంటి చర్యలు సరైనవి కాదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కడియం శ్రీహరి తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపణలు గుప్పించారు. ఒక ఎమ్మెల్యే మంత్రి శాఖలో నేరుగా సమావేశాలు నిర్వహించి. సమీక్షలు చేయటం సముచితం కాదని, ఇది ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
కడియం శ్రీహరి తనకు సమాధానం చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్
రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో వివిధ శాఖలలో ఉన్న సమస్యలపై ఆయా మంత్రులను కలిసి చర్చించవచ్చని కానీ నేరుగా కార్యాలయాల్లో జోక్యం చేసుకోవటం తగదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ వ్యవహారంపై కడియం శ్రీహరి తనకు సమాధానం చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఒక బీసీ మహిళ అయిన తనను అవమానించాలని చూస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు.
టీడీపీ నుండి వచ్చిన వాళ్ళతోనే తనకు ఇబ్బంది ఉందన్న కొండా సురేఖ
ప్రజా ప్రతినిధులు, మంత్రుల అధికార పరిధుల గురించి కనీసం అవగాహన ఉండాలన్నారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం సరికాదని కొండా సురేఖ అన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన నేతలే తనపైన దాడి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో మొదటనుండి ఉన్న వాళ్ళతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో కొండా సురేఖ కడియం శ్రీహరిని మాత్రమే కాదు టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులను , మంత్రులు అయిన వారిని టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications