ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా రిటర్న్ గిఫ్ట్: ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రాచీన చరిత్ర
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నారు. ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన మెల్ బోర్న్ లో అడుగు పెట్టారు. ఆ దేశ ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమవేశాల్లో పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరమ్, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఆంథోనీ అల్బనీస్ ఓ సెల్ఫీ తీసుకున్నారు.
ఈ పర్యటన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా కొన్ని రిటర్న్ గిఫ్ట్ లను అందించింది. భారత్ కు చెందిన అపురూపమైన చారిత్రక విగ్రహాలు, పూజా సామాగ్రిని వెనక్కి ఇచ్చేసిందా దేశం. అవి త్వరలోనే తిరిగి స్వదేశానికి చేరుకోనున్నాయి. తమిళనాడులోని అతి పురాతన ఆలయాలకు చెందిన ఈ అరుదైన సాంస్కృతిక సంపదను భారత్ కు తిరిగి అప్పగించడానికి ఆస్ట్రేలియా అంగీకరించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది.

ఇందులో భద్రకాళి అమ్మవారి రూపంతో కూడిన లోహపు త్రిశూలం, పవిత్ర రాతి నంది విగ్రహం, షణ్ముఖ కార్తికేయుడి రాతి విగ్రహం ఉన్నాయి. దీంతో దేశ పురాతన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే దిశగా, చట్టవిరుద్ధ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో ఓ ముందడుగు పడినట్టయింది. భారతీయ శిల్పకళా వైభవానికి, అపార సాంస్కృతిక చరిత్రకు నిదర్శనమైన ఈ కళాఖండాలు చోళులు, విజయనగర రాజుల కాలం నాటివి.
తిరిగా రాబోతున్న ఈ కళాఖండాలలో తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, కొల్లుమాంగుడిలో కొలువై ఉన్న శ్రీ కాశీవిశ్వనాథస్వామి ఆలయానికి చెందిన రెండు ముఖ్యమైన లోహ, రాతి శిల్పాలు ఉన్నాయి. అందులో మొదటిది త్రిశూలం. దీని పైభాగంలో ఉగ్రరూపంలో ఉన్న భద్రకాళి అమ్మవారి ప్రతిమ అత్యంత కళాత్మకంగా చెక్కారు కళాకారులు. శైవ శాక్తేయ సంప్రదాయాల ప్రకారం ఈ త్రిశూలం దుష్టశిక్షణ, దైవిక శక్తి, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది దాదాపు 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు.
అదే కాశీవిశ్వనాథస్వామి ఆలయానికి చెందిన మరో అరుదైన రాతి శిల్పం.. నంది విగ్రహం. పరమశివుడి వాహనమైన ఈ నందిని తమిళ శైవ శిల్ప సంప్రదాయంలో అత్యంత సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. మెడలో గంటలు, అందమైన పూలదండలతో ప్రశాంత వదనంతో పడుకుని ఉన్న భంగిమలో ఉన్న ఈ నంది శిల్పం చోళుల నాటి శిల్పకళా శైలిని కలిగి ఉంది. శైవ క్షేత్రాల్లో మహాశివుడి గర్భగుడికి అభిముఖంగా కనిపించే నంది విగ్రహం.. నిస్వార్థ భక్తి, బలం, ధర్మానికి ప్రతీక.
వీటితో పాటు తంజావూరు జిల్లా మానంబాడిలో కొలువైన ప్రసిద్ధ నాగనాథస్వామి దేవాలయానికి చెందిన ఆరు తలల కార్తికేయుడి రాతి విగ్రహం కూడా త్వరలోనే భారత్‌కు రానుంది. ఈ ఆలయం.. 11వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుడి కాలంలో నిర్మితమైంది. కార్తికేయుడి ఈ ఆరు ముఖాల రూపం అపారమైన దివ్య జ్ఞానం, శౌర్యాం, రక్షణను సూచిస్తుంది. 12 చేతుల్లో విభిన్న ఆయుధాలను ధరించి, పక్కనే వాహనమైన నెమలితో కూడి ఉన్న ఈ ఐతిహాసిక శిల్పం చోళుల కాలపు శిల్పకళా ప్రాభవానికి అద్దం పడుతోంది.












Click it and Unblock the Notifications