జగన్ ఇలాకాలో చంద్రబాబు కొత్త లెక్కలు, అభ్యర్దులు సిద్దం - లిస్టులో..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్దుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఈ సారి పట్టు సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ సిట్టింగ్ ల్లో కొన్ని మార్పుల దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఇదే జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంతో ఇక్కడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
అభ్యర్దుల ఎంపిక : కడప జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి అదే రిపీట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో కడప తో పాటుగా కమలాపురం, జమ్మలమడుగు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం సాగుతోంది. షర్మిల కడప జిల్లా నుంచే పోటీకి సిద్దమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో, జగన్ అభ్యర్దుల ఖరారు పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలోనే జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లలో ఆరింటికి టీడీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. పులివెందులలో సీఎం జగన్ పైన బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి)ని నిలపాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఎన్నికల ఇంఛార్జ్ గా బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు : కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్దిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆమె ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆమె ఇప్పటికే ప్రచారంలోకి దిగిపోయారు. కమలాపురంలో టీడీపీ ఈసారి కూడా పుత్తా కుటుంబాన్నే నిలపనుంది. పోయినసారి పుత్తా నరసింహారెడ్డి పోటీ చేశారు. ఈసారి ఆయన గానీ, ఆయన కుమారుడు చైతన్యరెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. మైదుకూరులో మళ్లీ టీటీడీ మా జీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కే అవకాశం ఇస్తున్నారు. జమ్మలమడుగులో చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డిని ఖరారుచేశారు. బద్వేలు(ఎస్సీ) స్థానంలో రోశన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పొద్దుటూరులో ఇంకా టీడీపీ అభ్యర్థిని ఖరారుచేయాల్సి ఉంది. ప్రవీణ్ రెడ్డి, వరదరాజులురెడ్డి, సీఎం సురేశ్ ఇక్కడ సీటు ఆశిస్తున్నారు.

ఎవరికి ఎక్కడ : రాయచోటి నుంచి మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత రాంప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథరెడ్డి రేసులో ఉన్నారు. రాజంపేట నుంచి గంటా నరహరి, జగన్మోహన రాజు, సుబ్బారెడ్డి,లో ఒకరికి ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. రైల్వే కోడూరు(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎన్నారై రేవతి పేరు ప్రచారంలో ఉంది. జనసేన ఈ సీటు ఆశిస్తోంది. ఇక, రాజంపేట ఎంపీ స్థానంలో సుగవాసి బాల సుబ్రమణ్యం పేరును నాయకత్వం ఖరారుచేసింది. కడప లోక్‌సభ స్థానంపై ఇంకా నిర్ణయానికి రాలేదు.ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో నిలుస్తారు..వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారా అనేది స్పష్టత వచ్చిన తరువాత అభ్యర్దిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications