చంద్రబాబు డెడ్ లైన్ - ఛలో తాడేపల్లి..!!
చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ..ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ధాన్యం కొనుగోలు కోసం సోమవారం సాయంత్రం లోపు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేసారు. లేకుంటే పోరుబాట తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ఓ పెద్ద స్కామ్ అని, రైతుల నుంచి మిల్లర్లు దోచిందంతా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోందని ఆగ్రహించారు. ప్రభుత్వ తీరు కారణంగా రైతులు నష్టపోయారని ఆరోపించారు.
మూడు రోజులుగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం, సమిశ్రగూడెం గ్రామాల్లో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ప్రభుత్వానికి విధించిన డెడ్‌లైన్ పూర్తి కాగానే పాడైపోయిన మొత్తం ధాన్యాన్ని ట్రాక్టర్లు, లారీలకు ఎక్కించి తాడేపల్లి జగన్ కొంపకు పంపిద్దామంటూ పేర్కొన్నారు. జగన్ అప్పటికీ బయటకు రాకపోయినా, మనల్ని తాడేపల్లి కొంపకు రానీకపోయినా ఇక ఆయనను శాశ్వతంగా బయటకు రానీయవద్దని, ఆ బాధ్యత రైతులే తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తడిచి పాడైపోయిన ధాన్యం కొనేవారులేక రైతులు కుమిలిపోతున్నారని పేర్కొన్నారు.

రైతులకు గోతాలు కూడా అందటం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ధాన్యం పొలాల్లోనూ, రోడ్లమీద ఉందన్నారు. వర్షాలు పడి అదంతా తడిచిపోయిందని చెప్పారు. చిరిగిన సంచులు ఇచ్చారన్నారు. వాటి వల్ల మరింత నష్టం వస్తుందని, ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఇది జరిగిందని వివరించారు. ఆర్‌బీకేలలో ఎఫ్‌పీవో పొందిన తర్వాత రైతు ఏ మిల్లుకూ వెళ్లకూడదని....21 రోజుల్లోనే రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బు పడుతుందని జగన్ ప్రభుత్వమే నిబంధనలు పెట్టిందని చెప్పుకొచ్చారు. ప్రతీ మిల్లు వద్ద నూకలు, రవాణా చార్జీలు, హమాలీల కూలీల పేరుతో రైతుల నుంచి ఎదురు కట్నం మాదిరిగా ఎదురు డబ్బులు తీసుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
మొత్తం ధాన్యం కొంటానని చెప్పడం కాదని, జీవో ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇంత సంక్షోభం ఏర్పడి రైతు బతుకు చిన్నాభిన్నం అయిపోతే ధాన్యం కొనుగోళ్లలో నూకలంటూ తేమశాతమంటూ రవాణా చార్జీలంటూ హమాలీల కూలీలంటూ అసలు ఇంత ధర ఇవ్వలేనంటూ కొనుగోలు చేసే పరిస్థితి లేదంటూ రైతులను ఏడిపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వరి, మొక్కజొన్న, మిరప, మామిడి అన్ని రకాల పంటలూ పాడైపోయాయని ప్రభుత్వం పైన సీరియస్ అయ్యారు. మిల్లర్లపై కేసులు పెట్టాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications