
టీడీపీ ఆ ఓట్లను కోల్పోయింది - అమరావతి లక్ష్యం నెరవేరలేదు : చంద్రబాబు..!!
Chandna Babu: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం అధికారం టీడీపీదేని ధీమా వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వ తీరు పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. తన సభలకు వస్తున్న స్పందన తమ విజయానికి సంకేతాలుగా చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని చెప్పిన చంద్రబాబు.. అమరావతి..జాతీయ రాజకీయాల పైన స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో టీడీపీకి కలిసొచ్చే అంశాలు..ఓట్ బ్యాంకుల గురించి స్పందించారు.

టీడీపీకి తిరిగి అధికారం ఖాయం..
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాలు..రానున్న ఎన్నికల పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. అదే సమయంలో వంద శాతం టీడీపీకే అధికారమని ధీమా వ్యక్తం చేసారు. అందుకు కారణాలను విశ్లేషించారు. వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ కక్ష సాధింపు ధోరణితో పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన పైన ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పుకొచ్చారు. గతంలో ప్రభుత్వాలు మారినా విధానాలు కొనసాగించే వారని.. కానీ, ఇందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్తుందని చంద్రబాబు స్పష్టం చేసారు. జాతీయ రాజకీయాల కంటే ఏపీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు.

ఆ ఓట్లను టీడీపీ కోల్పోయింది..
చంద్రబాబు తన హాయంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీని అభివృద్ధి చేయటం వలన యవత దానిని అందిపుచ్చుకొని విదేశాలకు వెళ్లిందని గుర్తు చేసారు. ప్రస్తుతం దాదాపు 30 శాతం మంతి యువత అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తుందని విశ్లేషించారు. దీంతో, స్థానికంగా ఓటర్లను టీడీపీ కోల్పోయిందని చంద్రబాబు నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఎన్నారైలకు ఓటింగ్ కల్పించటానికి తాము మద్దతు పలుకుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణలో బలపడటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అందుకే అక్కడ కాసానిని అధ్యక్షుడిగా నియమించా మని చంద్రబాబు వివరించారు. 2047 నాటికి దేశ జనాభా సగటు వయోభారం పెరిగే ప్రమాదం ఉందని..నియంత్రణ ఎత్తేసి జనాభా పెరుగుదలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు సూచించారు. జనాబా పెరుగుదల భవిష్యత్తులో వరం అవుతుంది తప్పితే శాపం కాదని చంద్రబాబు విశ్లేషించారు.
