కేశినేని డిసైడ్ అయినట్లేనా - చంద్రబాబు ఏం చేయబోతున్నారు..!?
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అధికారం నిలబెట్టుకోవటానికి సీఎం జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కంచుకోవాలని చంద్రబాబు పొత్తులు.. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అయితే, టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న విజయవాడలో పరిస్థితులు పార్టీకి సమస్యగా మారుతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు అనూహ్య నిర్ణయాలకు సిద్దం అవుతన్నారని సమాచారం.
కేశినేని తీరుపై గుర్రు : విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని తీరు కొంతకాలంగా పార్టీ శ్రేణులకు రుచించటం లేదు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సొంత పార్టీ నేలపైన కేశినేని నాని తీరు పైన పార్టీ నాయకత్వం వద్ద ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో విజయవాడ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో తన వర్గాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే ఇప్పుడు విజయవాడ టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి బేగ్, సెంట్రల్ నుంచి మల్లి ఖార్జున యాదవ్, జగ్గయ్య పేట నుంచి నెట్టెం రఘురాం, తిరువూరు నుంచి స్వామి దాసు, నందిగామ నుంచి జీవరత్నం, మైలవరం నుంచి అన్నా ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావులతో రాజకీయం చేస్తున్నారనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా వనిపిస్తోంది.
సొంత వర్గంతో ముందుకు : పార్టీ మహానాడుకు కేశినేని నాని హాజరు కాలేదు. తాజాగా నారా లోకేశ్ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. లోకేశ్ యాత్ర సమయంలో కేశినేని చిన్ని క్రియాశీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో టీడీపీ కంటే వైసీపీ నేతలతో సఖ్యతగా ఉండటం పైనా టీడీపీ నేతల్లో కొత్త చర్చకు కారణమైంది. కేశినేనాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
అదే సమయంలో అసలు టీడీపీలో కొనసాగుతారా..వైసీపీ తో టచ్ లో ఉన్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి ఇప్పటికే ముఖ్యనేతలు నాని పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పటం తో ఈ సందేహాలు మరింత బల పడుతున్నాయి. నాని వైసీపీలోకి వెళ్తే ఎంపీ సీటు ఖాయమనే చర్చ మొదలైంది. దీంతో, ఇప్పుడు విజయవాడ లోక్ సభతో పాటుగా నగరంలో పార్టీ పరిస్థితిపైన చంద్రబాబు ఫోకస్ చేసినట్లు సమాచారం.

చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ : ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీలో మార్పులకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ ఇంఛార్జ్ గా కేశినేని చిన్ని పేరు ప్రకటిస్తారని టీడీపీ నేతల్లో బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చిన్ని పార్టీ అభ్యర్ధి అవుతారని కొంత కాలంగా ప్రచారం ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. లోకేశ్ పాదయాత్ర సమయంలో చిన్ని అందరినీ సమన్వయం చేసుకోవటంలో సక్సెస్ అయ్యారని గుర్తు చేస్తున్నారు.
అయితే, నాని ప్రచారంలో ఉన్నట్లుగా టీడీపీ కాదని మరో పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉంటే చిన్నిని టీడీపీ నుంచి బరిలోకి దింపుతారా..లేక అన్నదమ్ముల మధ్య గ్యాప్ కారణంగా మాజీ ఎంపీ గద్దే రామ్మోహన్ ను బరిలోకి దింపుతారా అనే మరో చర్చ తెర మీదకు వస్తోంది. అప్పుడు చిన్నికి తూర్పు సీటు ఇస్తారని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల నడుమ చంద్రబాబు తీసుకొనే నిర్ణయాలపైన విజయవాడ టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదే సమయంలో చిన్ని ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కేశినేని ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే కార్యాచరణ ప్రారంభించారు. ఎన్టీఆర్,చంద్రబాబు స్పూర్తితో పేదలకు కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.ఇందులో భాగంగా 1600 మందికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు.తాను విమర్శలు పట్టించుకోనని...యువగళం సునామీలా జరుగుతోందని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications