మహానాడుకు టీడీపీ సన్నద్దం -16 కమిటీల ఏర్పాటు : పొత్తులు - ప్రజాయాత్రలపై ప్రకటన..!!
తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణను నేతలు ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతీ ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించే ఈ వేడుక గత రెండేళ్లు కరోనా కారణంగా వర్చ్యువల్ గానే నిర్వహించారు. ఈ సారి మాత్రం ఘనంగా నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నేతృత్వంలో మహానాడు నిర్వహణ, సమన్వయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రతీ ఏటా మూడు రోజులు జరిగే మహానాడు..ఈ సారి రెండు రోజులకే పరిమితం చేసారు.

మహానాడు - 16 కమిటీల ఏర్పాటు
ఇక, పార్టీ మహానాడు నిర్వహణకు 16 కమిటీలను అధినేత చంద్రబాబు ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నేతృత్వంలో మహానాడు నిర్వహణ, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఆహ్వాన కమిటీ : అచ్చెన్నాయుడు, బక్కని నరసింహులుతీర్మానాల కమిటీ లో యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాలవ శ్రీనివాసులు, షరీఫ్, నక్కా ఆనంద్‌బాబు, రామానాయుడు, రావుల చంద్రశేఖర్రెడ్డివసతి ఏర్పాట్ల కమిటీ లో రవిచంద్ర యాదవ్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావుసభా నిర్వహణ కమిటీ లో పయ్యావుల కేశవ్, రామ్మోహన్‌నాయుడు, ధూళిపాళ్లనరేంద్ర, వర్ల రామయ్య కొల్లు రవీంద్రను నియమించారు.

ఏపీ -తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు
అదే విధంగా.. ఏపీ -తెలంగాణకు చెందిన పలువురు నేతలతో ఈ కమిటీలను ఖరారు చేసారు. ప్రధానమైన ఆర్దిక వనరుల కమిటీలో గల్లా జయదేవ్.. కేశినేని నాని..మాజీ మంత్రి పీ నారాయణ..ప్రత్తిపాటి పుల్లారావు..జీవీ ఆంజనేయులు..రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి..బీసీ జనార్దనరెడ్డి...దామచర్ల ఆంజనేయులు..పుట్టా సుధకర్ యాదవ్..కంభంపాటి రామ్మోహన్..దామచర్ల సత్య..తెలంగాణ నుంచి గడ్డి పద్మావతి.. ఓరుగంటి ప్రభాకర్ లను నియమించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ .. ఈ మహానాడు ద్వారా కొత్త నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. పొత్తుల పైన చర్చలు జరుగుతున్న సమయంలో దీని పైన స్పష్టత ఇదే వేదిక నుంచి ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీ అధినేత ప్రసంగంలో ఈ అంశం పైన క్లారిటీ ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

పొత్తులు - ప్రజా యాత్రలపై కీలక నిర్ణయాల దిశగా
అదే విధంగా.. పార్టీ మేనిఫెస్టో పైన వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టే విధంగా... వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో... కీలక నినాదాలను ఈ వేదిక ద్వారా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏపీలో ఈ మూడేళ్ల కాలంలో జరిగిన పరిణామాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ చేపట్టబోయే కార్యకరణను సైతం ఖరారు చేయనున్నారు. ఇక, ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు...పార్టీ ముఖ్య నేత లోకేష్ భావిస్తున్నారు. ఇందు కోసం బస్సు యాత్ర..లోకేష్ సైకిల్ యాత్ర దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు ఎన్నికల ముందు పర్యటనలు చేసినా..లోకేష్ మాత్రం ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో..మహానాడు వేదికగా లోకేష్ తాను చేపట్టబోయే ప్రజాయాత్రను ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో.. 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్న టీడీపీ శ్రేణులకు ఈ మహానాడు కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications