జూ ఎన్టీఆర్ అంశంలో ఏం చేద్దాం- నేడు టీడీపీ పాలిట్ బ్యూరో మీట్ : భవిష్యత్ కార్యాచరణ పైనా..!!
ఏపీలో రాజకీయంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ పాలిట్ బ్యూరో కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం. .తరువాత వ్యక్తమైన స్పందన..వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన తరువాత ఈ సమావేశం కీలకంగా మారింది. అసెంబ్లీలో తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. తాను తిరిగి సీఎం అయ్యే వరకూ శాసనసభలో అడగు పెట్టనని శపధం చేసారు. టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు సైతం ఈ విడత సమావేశాలను బహిష్కరించారు.

పాలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు
ఇక, కీలకమైన అమరావతి అంశంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లులతో పాటుగా మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కు తీసుకుంటూ తీర్మానం చేసారు. దీంతో..ఈ రోజు జరిగే పాలిట్ బ్యూరో సమావేశంలో వీటన్నింటి పైనా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చంద్రబాబు సతీమణిని దూషించటం..దీని పైన వచ్చిన స్పందన పైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. వదర సహాయక చర్చల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత..వీటి విషయంలో పార్టీ పరంగా సాయం ప్రకటించారు.

రాజకీయంగా కార్యాచరణ ఖరారు
ఇక, రాజకీయంగా తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరాజయం ఇప్పుడు కీలకంగా మారింది. అదే విధంగా రాజకీయ నిర్ణయాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక, చంద్రబాబు కన్నీరు పెట్టటంతో నందమూరి కుటుంబం మొత్తం ఆయనకు సంఘీభావం ప్రకటించింది. తమ ఇంటి ఆడపడుచు గురించి మాట్లాడుతారా అంటూ నిలదీసింది. మరోసారి ఇటువంటివి జరిగితే నందమూరి వంశం మరో రూపం చూస్తారంటూ హెచ్చరించింది. ఎమ్మెల్యే బాలక్రిష్ణ దీని పైన సీరియస్ గా స్పందించారు.

జూ ఎన్టీఆర్ అంశం పైనా చర్చ
ఇక, ఇదే అంశం పైన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. దీని పైన పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య..బుద్దా వెంకన్న నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఈ వ్యాఖ్యల పైన సీరియస్ గా స్పందిస్తున్నారు. సింహాద్రి..ఆది లాగా వస్తారనుకుంటే ప్రవచనాలు చెప్పారంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. మేనత్త గురించి మాట్లాడితే మేనల్లుడిగా ఇదేనా స్పందించే విధానమంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.
Recommended Video

పార్లమెంట్ వ్యూహాల పైనా దిశా నిర్దేశం
ఇదే సమయంలో ఈ వ్యాఖ్యలతో అటు మంత్రి కొడాలి నాని..వల్లభనేని వంశీ సైతం స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ చెబితే తాము వింటామా.. గతంలో కలిసి ఉండేవారమని..ఇప్పుడు తాము జగన్ కోసం పని చేస్తున్నామని స్పష్టం చేసారు. దీంతో..పార్టీ పరంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి... ఇప్పటికే పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల పైన ఏరకమైన స్పష్టత ఇవ్వాలనే అంశం పైన చర్చించే అవకాశం ఉంది. పాలిట్ బ్యూరో సమావేశం ముగిసిన తరువాత పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications