ఇందిరమ్మ టవర్స్.. రేపే హైదరాబాదీల సొంతింటి కల తీర్చటానికి సీఎం రేవంత్ శంకుస్థాపన!
హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ పై శుభవార్త. హైదరాబాద్ నగర పరిధిలో ఇల్లు లేని నిరుపేదల కోసం సొంత ఇళ్లు అందించే ఇందిరమ్మ ఇళ్ళ టవర్ నిర్మాణంపై కీలక అప్డేట్ వచ్చింది . నిరుపేదల సొంతింటి కలనెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేస్తోంది. క్యూర్ పరిధిలో చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం రేవంత్ చేతుల మీదుగా ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు ఇందిరమ్మ టవర్స్ కు పునాది పడుతుందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.హైదరాబాద్ మహా నగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను నెరవేర్చేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో ఐదు ఎకరాల ప్రాంతంలో నాలుగు టవర్లు నిర్మిస్తారన్నారు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ కోసం ఇప్పటివరకు 90 ఎకరాల భూమి
ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉండేలా మొత్తం 480 ఫ్లాట్లు నిర్మాణం జరుగుతుంది. ఒక్కో ఫ్లోర్‌లో 12ఫ్లాట్లు ఉంటాయి. ఈ నిర్మాణానికి సుమారు 43.20 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ కోసం ఇప్పటివరకు సుమారు 90 ఎకరాల భూమిని ఎంపిక చేశామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో కూడా నగరం నడిబొడ్డున పేదలకు సొంత ఇల్లు కల్పిస్తున్నాం అన్నారు.
గృహనిర్మాణ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది
పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వటం కేవలం భవన నిర్మాణం కాదని, ఒక కుటుంబానికి భద్రత, భవిష్యత్ తరానికి భరోసా, గౌరవంతో కూడిన జీవితం అందించడమేనని ఆయన అన్నారు.ప్రజా ప్రభుత్వం పేదలు నగరానికి దూరంగా కాకుండా నగరంలోనే గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ కోసం దరఖాస్తుల వెల్లువ
ఇక ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ నిర్మాణం చేపడుతున్న క్రమంలో హైదరాబాదీల నుండి దరఖాస్తులు వెల్లువ కావటంతో దరఖాస్తు గడువు తేదీలను పెంచారు. మొదట ఈ నెల 10 దరఖాస్తులకు చివరి తేదీ కాగా, ఈ నెల 15 వరకు అప్లికేషన్స్ చేసుకునే వారి గడువును పొడిగించారు.













Click it and Unblock the Notifications