తల్లికి ప్రభుత్వం ఇచ్చిన భూమిపై కొడుకుకు హక్కు లేదు! హైకోర్టు సంచలన తీర్పు!!
ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించే భూముల విషయంలో మద్రాస్ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. నిబంధనలతో కూడిన ప్రభుత్వ భూమి పట్టా పొందిన వ్యక్తి మరణించిన తర్వాత ఆ భూమి ఆటోమేటిక్‌గా వారసులకు చెందదని కోర్టు స్పష్టం చేసింది. వారసులకు ఆ పట్టా బదిలీ కావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు నిబంధనలను వారు కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
తల్లి భూమి కోసం కొడుకు పోరాటం.. అసలేం జరిగిందంటే?
తమిళనాడుకు చెందిన ఎ.మసీలమణి అనే వ్యక్తి తల్లికి అక్కడి ప్రభుత్వం 'గ్రామ నథం' పథకం కింద నివాసం కోసం 3 సెంట్ల భూమిని కేటాయించింది. భూమిలేని నిరుపేదలకు ఆవాసం కల్పించే ఉద్దేశంతో కొన్ని షరతులతో ఈ భూమిని ఇచ్చారు. అయితే తల్లి మరణించిన తర్వాత కుమారుడు ఆ స్థలంలో నివాసముంటూ తల్లికి తాను చట్టపరమైన వారసుడినని, కాబట్టి ఆ భూమి పట్టాను తన పేరు మీదకు మార్చాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.

పట్టా బదిలీకి బదులు ఖాళీ చేయాలని నోటీసులు
కుమారుడి దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే.. రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఖాళీ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. తమిళనాడు భూఆక్రమణల చట్టం, 1905లోని సెక్షన్ 6 కింద ల్యాండ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. అధికారుల ఈ చర్యను సవాలు చేస్తూ మసీలమణి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. 'గ్రామ నథం' భూమి ప్రభుత్వానికి చెందినది కాదని.. తల్లి వారసుడిగా తనకు ఆ భూమిపై పూర్తి హక్కు ఉందని అతడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేటాయింపు నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు.
హైకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే?
ఇరుపక్షాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు నవంబర్ 4, 2026న కీలక తీర్పు వెలువరించింది. షరతులతో ప్రభుత్వం కేటాయించిన భూమి ఆటోమేటిక్‌గా పిత్రార్జిత ఆస్తిగా మారిపోదు. అసలు లబ్ధిదారు మరణించిన తర్వాత వారి వారసులు కూడా ప్రభుత్వ భూమి పొందడానికి నిర్దేశించిన అర్హత నిబంధనలకు లోబడి ఉన్నారో లేదో అధికారులు తనిఖీ చేయాలి. ఒకవేళ వారసులకు ఆ అర్హతలు లేకపోతే పట్టా బదిలీ చేసే హక్కు ఉండదు. నిబంధనల ఉల్లంఘన జరిగినా లేదా వారసులకు అర్హత లేకపోయినా, రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ 21, 26 ప్రకారం ఆ భూమిని వెనక్కి తీసుకుని, అర్హులైన మరో నిరుపేద కుటుంబానికి కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు స్పష్టం చేస్తూ పిటిషనర్‌కు ఊరట ఇచ్చేందుకు నిరాకరించింది.













Click it and Unblock the Notifications
