బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం!
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు మృతి
కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. శ్రీనివాస్ రావు మృతదేహాన్ని సుచిత్రలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన రాక తర్వాతే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ నేతల నివాళి
జోగినపల్లి శ్రీనివాస్ రావు కేటీఆర్‌కు మేనమామ. కేసీఆర్ సతీమణి శోభకు స్వయంగా సోదరుడు. మృతి వార్త విన్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తమకు ఉన్న అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని సుచిత్రలోని జోగినపల్లి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు.
జోగినపల్లి కుటుంబాన్ని పరామర్శించి, ఆవేదన చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాస్ రావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ఈ లోటును తట్టుకునే శక్తిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించారు.
మొన్న పెద్ది.. ఇప్పుడు జోగినపల్లి మృతితో విషాదం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసినప్పుడు జోగినపల్లి శ్రీనివాస్ రావు అక్కడే ఉండి అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కేసీఆర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందగా, ఇప్పుడు కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు మృతి చెందారు.












Click it and Unblock the Notifications