జైలు నుంచి చంద్రబాబు లేఖ - కీలక అంశాల ప్రస్తావన, ఉద్వేగం..!!
తెలుగు ప్రజలకు జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాసారు. తాను జైలులో లేను....ప్రజల హృదయాల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరని పేర్కొన్నారు. 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరని స్పష్టం చేసారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..తాను త్వరలో బయటకొస్తానని వెల్లడించారు.
45 ఏళ్ల జీవితం కళ్ల ముందు:ములాఖత్‌లో భాగంగా తనను కలిసిన కుటుంబసభ్యులకు తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను రాసిన లేఖని అందజేశారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేసారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నానని... విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజలే తన కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం తన కళ్ల ముందు కదలాడుతోందని చంద్రబాబు వివరించారు. తన రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి .. సంక్షేమమే లక్ష్యంగా సాగిందని చెప్పిన చంద్రబాబు.. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యమని ప్రజలను ఉద్దేశించి వివరించారు.

గుర్తుకొస్తూనే ఉంటా:ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి దూరం చేశామనుకుంటున్నారని విశ్లేషించారు. తాను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు.. కానీ, అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటానని వివరించారు. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి తాను గుర్తుకొస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ప్రజల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ.. తాను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరన్నారు. ఈ చీకట్లు తాత్కాలికమేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవన్నారు. జైలుగోడలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని... జైలు ఊచలు తనను ప్రజల్నించి దూరం చేయలేవన్నారు. తాను తప్పు చేయనని.., చేయనివ్వనని స్పష్టం చేసారు.
మ్యానిఫెస్టో విడుదల చేస్తా:ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు. అదే రాజమహేంద్రవరం జైలులో తనను ఖైదు చేశారన్నారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని వెల్లడించారు. తన ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఎప్పుడూ బయటకు రాని నందమూరి తారకరామారావు బిడ్డ, తన భార్య భువనేశ్వరిని తాను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని తాను కోరానని... ఆమె అంగీకరించిందని వివరించారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి 'నిజం గెలవాలి' అంటూ మీ ముందుకు వస్తోందని పేర్కొన్నారు.

త్వరలో బయటకు వస్తా:జనమే తన బలం, జనమే తన ధైర్యం. దేశవిదేశాలలో తన కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారని వివరించారు. తన క్షేమం కోసం కుల,మత,ప్రాంతాలకు అతీతంగా చేసిన ప్రార్థనలు ఫలిస్తాయన్నారు. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమేనని చెప్పారు. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకి వస్తానని ధీమా వ్యక్తం చేసారు. అంతవరకూ నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. చెడు గెలిచినా నిలవదు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుందన్నారు. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందని చంద్రబాబు తన లేఖలో వివరించారు.












Click it and Unblock the Notifications