సీబీఐకి ఇది సవాల్ : నాడు పరిటాల - నేడు వివేకా కేసులో : చంద్రబాబు ఫైర్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. వివేకా కేసులో జరుగుతున్న పరిణామాలు సీబీఐకి సవాల్ కాదా అని ప్రశ్నించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో ఏ విధంగా నిందితులు..సాక్ష్యులు మరణించారో..ఇప్పుడు వివేకా కేసులోనూ అదే జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. సీబీఐ బెదిరిస్తోందంటూ వారి పైనే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో విచారణ చేయాలని ఆయన కుమార్తే కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. సీబీఐ కే సమర్ధత లేకపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు.

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ల పాలన పైన ఆయన క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ బుక్ లెట్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఉందని ఆరోపించారు. కొత్త డీజీపీ వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పేర్కొన్నారు. తనతో సహా అందరి పైనా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. హత్య కేసులో ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి..దానిని డైవర్ట్ చేయటం కోసం కులాల మధ్య గొడవలు పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు.

అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు
ఇప్పుడు ఆ అల్లర్ల పేరుతో అమాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసుతో సానుభూతి పొందే ప్రయత్నం నాడు వైసీపీ చేసిందన్నారు. సాక్షులు ఎందుకు చనిపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మూడేళ్ల కాలంలో 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేసారని లెక్కలు చెప్పారు. వైసీపీ ఏపీని మూడేళ్లలో వల్లకాడు చేసిందంటూ ధ్వజమెత్తారు. నలుగురు మాజీ మంత్రుల్ని జైలుకు పంపారని విమర్శించారు. ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసారన్నారు. 2552 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. 232 మంది నాటుసారా కారణంగా చనిపోయారని చెప్పుకొచ్చారు.

సీబీఐ పై సంచలన వ్యాఖ్యలు
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటంతో 62 మంది చనిపోయారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ అసమర్ధత కారణంగా రెండు లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఫెయిల్ అయ్యారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఫెయిలైన విద్యార్ధులు కొందరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న పథకాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. పోలీసులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తామే ప్రజల తరపున పోరాడుతామని... పోలీసులు న్యాయం చేస్తే మద్దతిస్తాం.. అన్యాయం చేస్తే సహాయ నిరాకరణ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. అవసరమైతే వేధించే వారి పైన ప్రయివేటు కేసులు వేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications