చంద్రబాబు సమరశంఖం - కొత్త నినాదంతో ప్రజల్లోకి : ఏడాది పాటు - ఇక దూకుడే...!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఈ రోజు నుంచి ఏడాది పాటు ఆయన ఇక ప్రజల మధ్యనే ఉండనున్నారు. మహానాడు తో పార్టీలో వచ్చిన జోష్ ను కంటిన్యూ చేసేందుకు ప్రజలు.. పార్టీ నేతలతోనే ఏడాది పాటు మమేకం అవుతూ..ఎన్నికలకు సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. నేడు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం అవుతున్న చంద్రబాబు యాత్ర..దాదాపు ఏడాది పాటు 26 జిల్లాల్లోని వంద నియోజకవర్గాలను కవర్ చేస్తూ పర్యటించనున్నారు. ఈ సారి తన పర్యటనకు కొత్త పేరు ఖరారు చేసారు.
కొత్త నినాదంతో పర్యటన
ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. తొలి రోజు పర్యటన విశాఖ జిల్లా చోడవరంలో బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించి..అక్కడ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. రేపు అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు (గురువారం) పర్యటనలో విశాఖ నగర పరిధిలోని గాజువాక, ఎన్ఏడీ జంక్షన్, ఆనందపురం, తగరపువలస మీదుగా రోడ్డు షో ద్వారా విజయనగరం జిల్లా అమతం రాయవలస చేరుకుంటారు. 17వ తేదీన నెల్లిమెర్ల, రామతీర్థం జంక్షన్, గుర్ల, పెనుబర్తి జంక్షన్, తోటపల్లి కెనాల్, గరివిడి, చీపురుపల్లి గ్రామాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.

మహానాడు - బహిరంగ సభలు
పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సాగనున్న చంద్రబాబు పర్యటనలో నియోజకవర్గాల వారీగా మినీ మహానాడు తో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా పార్టీ నేతలను - కార్యకర్తలను ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి పార్టీ నేతలను మోహరించిన చంద్రబాబు..ఇప్పుడు తానే స్వయంగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కేడర్ సిద్దంగా ఉండే విధంగా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు.

టూర్ లోనే పొత్తుల పై క్లారిటీ
అదే సమయంలో అక్టోబర్ లో లోకేష్ సైతం ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఈ పర్యటనల సమయంలోనే.. జనసేన అధినేత పవన్ సైతం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. దీంతో..మరోసారి పొత్తుల అంశం ఈ పర్యటనల సమయంలోనే ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరి..ఇద్దరు పార్టీల అధినేతలు పొత్తుల అంశంలో ఏం క్లారిటీ ఇస్తారనేది చూడాల్సి ఉంది. ఇక, చంద్రబాబు పర్యటనలకు వచ్చే స్పందన పైన ఇప్పుడు పార్టీ నేతలతో పాటుగా పొలిటిలక్ సర్కిల్స్ లోనూ ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications