ఇక ప్రజల్లోకి చంద్రబాబు-ఎన్టీఆర్ తరహాలో యాత్ర ? అసెంబ్లీ అవమానంపై పోరు-త్వరలో ప్రకటన
ఏపీ అసెంబ్లీలో నిన్న చోటు చేసుకున్న అవమానకర పరిణామాల నేపథ్యంలో రగిలిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి గెలిచాకే తిరిగి సభలో ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథం చేశారు. తనకు ప్రజలు మద్దతివ్వాలని ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం కోరారు. దీంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం ఖాయమైంది. అయితే ఈ యాత్ర ఎలా ఉండాలన్న దానిపై చంద్రబాబు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుకు అవమానం
నిన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలతో వాగ్యుద్ధం సందర్భంగా తన సతీమణిపై వారు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. గౌరవ సభ కాస్తా కౌరవసభగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తన పట్ల, తన సతీమణి భువనేశ్వరి విషయంలో ప్రవర్తించిన తీరుపై రగిలిపోతున్న చంద్రబాబుకు మద్దతుగా ఇప్పటికే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచే నిరసన ప్రదర్శనలకు, ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు.. ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు, వారిని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇందుకోసం పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు. నిన్న అసెంబ్లీ ఘటన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. తిరిగి సోమవారం వచ్చి నేతలతో భేటీ అయ్యే అవకాశముంది.

ఎన్టీఆర్ తరహాలోనే
గతంలో ప్రధాని ఇందిర సూచనతో రామ్ లాల్ తనను పదవీచ్యుతుడ్ని చేసినప్పడు టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. తనకు అండగా నిలవాలని కోరారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేంద్రం దిగి వచ్చి ఎన్టీఆర్ ను తిరిగి సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు కూడా ఎన్టీఆర్ తరహాలోనే ప్రజల్లోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చంద్రబాబు అడుగులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బస్సుయాత్ర చేపట్టే అవకాశం
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తనను, తన భార్యను అవమానించారని ఆరోపిస్తున్న చంద్రబాబు.. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇందుకోసం పాదయాత్ర చేసేందుకు ఇప్పట్లో అవకాశం లేదు. సాధారణ ఎన్నికలకు రెండున్నరే్ళ్ల సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు పాదయాత్ర చేపడితే ఉపయోగం లేదు. దీంతో బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నగరాల్ని, పట్టణాల్ని కలుపుతూ బస్సు యాత్ర చేపట్టేందుకు పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశాలున్నాయి. వారు ఇచ్చే సూచన ఆధారంగా బస్సు యాత్ర లేదా మరో రూపంలో స్వల్పకాలిక యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications