
రాజకీయాల్లో అరుదైన ప్రయోగం చేయబోతున్న తెలుగుదేశం?
తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని ప్రయోగం చేయబోతోంది. ఒక మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే తన బలంతోపాటు బలహీనతలను కూడా తెలుసుకోవాలి.. వాటిని అధిగమించాలి. అలా చేసినప్పుడే విజయం సాధ్యమవుతుంది. టీడీపీ కూడా ఇప్పుడు ఇదే సూత్రాన్ని అనుసరిస్తోంది.
తన తప్పులు తాను తెలుసుకోవడంతోపాటు తన బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనేది పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుంటోంది.. తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. వ్యక్తిగా ఒక్కడు తనను తాను తీర్చిదిద్దుకోవడం సులభం. కానీ ఒక వ్యవస్థగా కోట్లమందితో మమేకమైన ఒక రాజకీయ పార్టీ తనను తాను మార్చుకోవడం అనేది రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగే విషయం.

చంద్రబాబు నుంచి లోకేష్ వరకు లోపాలను ప్రస్తావించారు!
ఇటీవల కాలంలో తరుచుగా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ వరకు అందరు నేతలు పార్టీలోని లోపాలను ప్రస్తావించుకుంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు దగ్గర నేతలంతా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి బాగుందని చెప్పి ఆయన్ను తప్పుదారి పట్టించినవారే ఎక్కువ. కానీ లోకేష్ రాష్ట్రమంతటా కలియతిరుగుతుండటంతో క్షేత్రస్థాయిలో లోపాలేమిటో అన్నీ తెలిసివస్తున్నాయి. దీంతో గతంలోలా చంద్రబాబు దగ్గర బాకా ఊదడానికి సదరు నాయకులకు అవకాశం రావడంలేదు. వచ్చినా చంద్రబాబు వాటిని పెడచెవిన పెడుతున్నారు.

ఒకరిచేత తప్పుల్ని ఎత్తి చూపించుకోవద్దు?
ఎవరో మనల్ని విమర్శించడం, మన తప్పులను ఎత్తి చూపడం, బలహీనతలను ప్రస్తావించడం కంటే ముందే మనమే తెలుసుకొని ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తినకుండా ఉండొచ్చనే భావన పార్టీలో కలిగింది. అన్నీ విశ్లేషించుకుంటే 175 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలు లేరు. ఇన్‌ఛార్జిలు ఉన్న 40 నియోజకవర్గాల్లో అంతర్గత పోరు సాగుతోంది. వీరి ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని తాజాగా జరిగిన ఒక సమావేశంలో నేతలంతా అభిప్రాయపడ్డారు.

నాయకుల మధ్య ఆధిపత్య పోరు?
దాదాపుగా 100 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగానే ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చంద్రబాబునాయుడు స్వయంగా ఒప్పుకున్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమిద్దామన్నారు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది..
కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకోవద్దని, ఎవరైతే కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్నారో వారినే అందలం ఎక్కిద్దామన్నారు. లోపాలన్నింటినీ సరిదిద్దుకొని పార్టీని కళ్లెం విడిచిన గుర్రంలా ముందుకు పరుగులెత్తిద్దామని చంద్రబాబు ఆ సమావేశంలో స్ఫూర్తిని నింపారు.