మాజీ మంత్రికి చంద్రబాబు పచ్చజెండా?
2024లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభకు జరగబోయే జమిలి ఎన్నికలు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇరు పార్టీల అధినాయకత్వం ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒక పార్టీపై మరోపార్టీ పై చేయి సాధించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నడూ లేనివిధంగా ఈసారి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.

ఆళ్లగడ్డ, నంద్యాల రెండూ గెలవాలి!
కచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికలు కావడంతో బాబు చెమటోడుస్తున్నారు. గతానికి భిన్నంగా రెండు సంవత్సరాల ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. రాయలసీమపై ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డలను ఎలాగైనా టీడీపీ ఖాతాలోకి వేయాలని భావిస్తున్నారు. ఆళ్లగడ్డ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

వ్యవహారశైలితో దూరం జరిగిన బంధువర్గం?
మంత్రిగా ఉన్న సమయంలోను, వివాహమైన తర్వాత అఖిల ప్రియ వ్యవహారశైలితో బంధువర్గంమంతా ఆమెకు దూరం జరిగారు. దీంతో వీరిని దరిచేర్చుకునే ప్రక్రియను ప్రారంభించారు. అందరి ఇళ్లకు వెళుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబునాయుడతో వారికి అవసరమైతే హామీ ఇప్పిస్తానని చెబుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు. ఆమె మృతిచెందడంతో ఉప ఎన్నికల్లో అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు.

సోదరుడితో ఉన్న భూ వివాదాలను పరిష్కరించుకుంటూ..
అప్పటికే భూమా కుటుంబం వైసీపీ వీడి టీడీపీలో చేరింది. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఓటమిపాలయ్యారు. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం వైసీపీ తరఫున గంగుల కుటుంబం ఆళ్లగడ్డలో పాగా వేయగలిగింది. ఈసారి కూడా ఇక్కడి నుంచి విజయం సాధించడానికి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంపై పట్టును కోల్పోకుండా ఉండేందుకు ఆయన శతథా ప్రయత్నిస్తున్నారు. తన సోదరుడితో ఉన్న భూ వివాదాలను కూడా అఖిలప్రియ పరిష్కరించునే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరిగే ఎన్నిక హోరాహోరీగా జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.