తెలియకుండానే చంద్రబాబు వ్యూహంలో చిక్కుకున్న మోడీ-షా?
భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచారు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ వాటిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ చంద్రబాబువల్లే టీడీపీ నిలదొక్కకుందని రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకోవడంద్వారా తన రాజకీయ చతురతను బాబు మరోసారి నిరూపించారు.
ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ సీట్లను తీసుకుంది. ఏపీలో బలం లేకపోయినప్పటికీ ఆరు లోక్ సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లంటే సాధారణ విషయం కాదు. ఆరు ఎంపీ సీట్లంటే 42 అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానం. ఇక్కడే చంద్రబాబు తాను అనుకున్నది సాధించారు. బీజేపీతో సర్దుబాటు ఒక కొలిక్కి రాకముందే మూడు జాబితాలను విడుదల చేశారు. 13 లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దీనివల్ల బీజేపీపై ఒత్తిడి పెరిగింది. ఆరు లోక్ సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయలేని బలహీన స్థితిలో జాతీయ పార్టీ ఉందా? అనే చర్చ నడుస్తోంది.

ఈ సందర్భంలోనే మొత్తం వ్యవస్థను తన అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే ఆ ప్రభావం పొత్తుపై పడుతుంది. ఈ తరుణంలోనే పొత్తు ధర్మంలో భాగంగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపికచేసే బాధ్యతను కూడా తానే చక్కబెడతారు. ఇప్పటికే చంద్రబాబు అనుకూలురైన నేతలకే బీజేపీ సీట్లిచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
అలాచేయడం ఆ పార్టీ అధిష్టానానికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆలస్యమవుతున్నకొద్దీ బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో టీడీపీతో సంప్రదింపులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా, ఆయన సూచించే వ్యక్తులు కూడా బీజేపీ అభ్యర్థులుగా ఎంపికయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరిణామాలు ఏవిధంగా మలుపుతిరుగుతాయో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications