మీ కుటుంబాలకూ రేపు ఇదే పరిస్థితి వస్తే??.: చంద్రబాబు
విజయవాడ పటమటకు చెందిన మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నుపాటి గాంధీపై దాడికి దిగినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాంధీని ఆయన పరామర్శించారు. శనివారం పటమటలో వైసీపీకి చెందిన కొందరు గాంధీపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్‌కు సంబంధించి పనులు చేయిస్తున్నత రుణంలో జరిగిన ఈ దాడిలో ఇనుపచువ్వతో పొడవడంతో ఆయన కుడికంటిని కోల్పోయారు.
రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతో ఈ తరహా దాడులకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని బాబు మండిపడ్డారు. దోషులకు శిక్ష పడేవరకు పోరాడతామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటున్నారని, రేపు మీ కుటుంబాలకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. విజయవాడలో గతంలో పట్టాభిపై దాడికి పాల్పడ్డారని, ఆరోజే చర్యలు తీసుకొనివుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

టీడీపీ కార్యకర్తలు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపైనే పోరాడుతున్నారని, తమకు ఎటువంటి సొంత అజెండాలు లేవని బాబు స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు పాల్పడుతున్న అరాచకాలపై ప్రజల్లో చైతన్యం ప్రారంభమైందని, తమ పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది.. ఎదుర్కొందన్నారు. గాంధీపై దాడి ఎమోషన్లో జరిగిందని పోలీసులు చెప్పడంపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications