జగన్ అడ్డాలో చంద్రబాబు, ఇద్దరు మాజీ సీఎంలు రెఢీ.. నిన్న వైఎస్ షర్మిల, నేడు.. ??
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డాలో అడుగు పెడుతున్నారు. మాజీ సీఎం తరపున మరో మాజీ సీఎం ఎన్నికల ప్రచారం చేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కడపలో ఏం మాట్లాడుతారు ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకే రోజు చంద్రబాబు నాయుడు రెండు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న సందర్బంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే టిక్కెట్లు దక్కని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు జంప్ జిలాని అంటూ పార్టీలు మారిపోయారు. ఎవరు పార్టీలు మారినా గెలుపు మాదే అంటూ టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు ధీమాగా ఎవరికి వాళ్లు తీరికలేకుండా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీల నాయకులు నానా తిప్పలు పడుతున్నారు.

గురువారం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి, వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రమైన కడపలో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటున్న చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి హెలికాప్టర్ లో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి చేరుకుంటారు. రాయచోటిలోని రాజధాని ఫంక్షన్ హాల్ మైదానంలో గురువారం మద్యాహ్నం 3. 30 గంటలకు బంగ్లా జంక్షన్ లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు.
రాజంపేట లోక్ సభ నియోజక వర్గం ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (బీజేపీ), రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తరపున చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. ఇదే సమయంలో అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లె, రాయచోటి మధ్య జరుగుతున్న శీతలసమరం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తరువాత హెలికాప్టర్ లో కడప విమానాశ్రయంకు చేరుకుంటున్న చంద్రబాబు నాయుడు 5.30 గంటల నుంచి రోడో షోలో పాల్గొంటారు. కడప నగరంలోని బిల్డప్, ఐటీఐ, సంధ్యా, కోటిరెడ్డి, ఎన్టీర్ జంక్షన్ మీదుగా జరిగే రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అయ్యే బహిరంగ సభలో కడప లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థి భూపేష్ రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవి తరపున ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇటు సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులను ఏకిపారేయడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె సొంత అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ కడపలో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ కడపలో ఏం మాట్లాడుతారో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు పర్యటన సందర్బంగా కడప, రాయచోటిలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications