వలంటీర్లకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీ: చంద్రబాబు సూచనలు
Chandrababu Naidu: ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్రంలో చేపట్టాల్సిన పింఛన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయంగా పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రత్యేక మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్రంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ- లోక్‌సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయడం సరికాదని పేర్కొన్నారు.

దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తుడు అనే పేరుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన అధికారి కావడం దీనికి ఓ కారణంగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ తీసుకున్న పలు నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పలు పిటీషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా సకాలంలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని ఉత్వర్వులు అమలు కాలేకపోయాయి కూడా.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని సూచించారు. లబ్దిదారులకు సకాలంలో పింఛన్ మొత్తాలు అందేలా గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications