పవన్ కల్యాణ్, పురంధేశ్వరిపై చంద్రబాబు వ్యూహం వేరు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ ప్రచారం నిర్వహించినా గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, చేయాల్సిన అభివృద్ధి గురించి మాత్రమే చెబుతుండేవారు. దీనివల్ల వినేవారందరికీ ఎప్పుడూ చెప్పిందే చెబుతున్నాడురా బాబూ అంటూ మొత్తుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం తన ఎన్నికల ప్రసంగశైలిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే అక్కడ స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి నాయకుల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు.
ప్రసంగంలో వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా ప్రస్తావించడంవల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ప్రచారం పొడవునా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. తాజాగా పర్యటించిన ఉభయ గోదావరి జిల్లాల్లోను ఇదే పద్ధతిని అనుసరించారు. పవన్ కల్యాణ్ తో కలిసి చేసిన ప్రచారంలోను ఆయన ఇమేజ్ ను పెంచేలా మాట్లాడారు. దీనివల్ల జనసైనికుల్లో మంచి జోష్ నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయంలోను ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆమెతోపాటు ఆ పార్టీ అగ్రనేతలను పదే పదే ప్రస్తావిస్తూ ఆ పార్టీ శ్రేణుల అభిమానాన్ని పొందుతున్నారు.

మోడీ నేతృత్వంలోనే ఎన్డీయేకు మద్దతిస్తూ ఏపీని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిస్తున్నారు. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన వేర్వేరు కాదని, కూటమి అంతా ఒకటేనంటూ ఆ రెండు పార్టీల అభ్యర్థులను పక్కన పెట్టుకొని మరీ వారిని గెలిపించాలని ప్రజలకు విన్నవిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా తెలుగుదేశం పార్టీని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా మూడు పార్టీలు ఒకటే అనే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. తరుచుగా తన ప్రసంగంలో చేసింది చెప్పడంకన్నా ప్రభుత్వ వైఫల్యాలను పదే పదే ప్రస్తావించడంద్వారా ప్రజలు బాగా దగ్గరవుతున్నారని, వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు అనుగుణంగానే మాట్లాడటంవల్ల కూటమికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని గుర్తించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంతే వ్యూహాత్మకంగా ప్రసంగాలు చేస్తున్నారు. అంతిమంగా ఆయనకు కావల్సిన విజయం దక్కిందా? లేదా? అనేది తెలియాలంటూ జూన్ నాలుగోతేదీ వరకు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications