తిక్కలోడికి ఓటేస్తే ఏమైందో తెలుసా?
గత ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడికొండలో ప్రజాగళం సభలో పాల్గొని మాట్లాడారు. జగన్ లాంటి రాక్షసులు వెయ్యిమంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. ఈ ప్రాంత రైతులు, మహిళలు చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
రాజధాని కోసం 35వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారని, కేంద్రం కూడా సహకరించిందని, ప్రపంచ దేశాలన్నీ అమరావతివైపు చూస్తున్న తరుణంలో జగన్ వచ్చి రాజధాని లేకుండా చేశారన్నారు. ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వెళుతోందని, రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదని, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమే రాజధాని అన్నారు. అమరావతిని ఎవరూ ఇక్కడి నుంచి కదల్చలేరన్నారు. అసాధ్యాన్ని తెలుగుదేశం సుసాధ్యం చేస్తుందన్నారు.

విశాఖ, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తామని, గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయని, ఆ జిల్లాల్లో వైసీపీకి ఒక్కసీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజల సంబరాలతోపాటు జగనాసుర వధ కూడా జరుగుతుందన్నారు. జగన్ పోవాలి, ప్రజలు గెలవాలన్నారు. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని, పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయాయని, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సభలకు జనం రావడంలేదని, ప్రజలకు వైసీపీపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే పోలవరం పూర్తయ్యేదని, నదుల అనుంధానం చేద్దామనుకున్నానని, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందన్నారు. జూన్ నాలుగోతేదీన విజయోత్సవాలు చేసుకుందామన్నారు.












Click it and Unblock the Notifications