ఏపీలో ఎన్నికలపై జగన్ ప్లాన్ ఇదీ - బయట పెట్టిన చంద్రబాబు..!!
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే అంశం పైన పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైసీపీ తీరు చూస్తుంటే వచ్చే 2023 మే నెలలో లేదా డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేసారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నేతలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేతలంతా ఇప్పటి నుంచే ప్రజలతో మమేకం అయ్యేలా..క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని నిర్దేశించారు.
ముందస్తు ఎన్నికలు ఖాయం
తాను ఇక జిల్లాల్లో ఉంటానని చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. నందిగామ, జగ్గయ్య పేట నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తీరు చూస్తుంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది కర్ణాటక ఆ తరువాత తెలంగాణ ఎన్నికలు జరగనున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఆ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటుగానే ముందుగా కర్ణాటక లేదంటే ఆ తరువాత తెలంగాణతో పాటుగా ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేసారు.

జిల్లాల పర్యటనకు చంద్రబాబు
వాలంటీర్ల వ్యవస్థతో పాటుగా.. అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ కుయుక్తులు పన్నుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను - కుట్రలను పార్టీ నేతలు సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక రంగాలు కుదేలయ్యాయని, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాల పైన ఎక్కువగా ఫోకస్ చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే ఇటు చంద్రబాబు ..అటు సీఎం జగన్ వరుసగా నియోజకవర్గాల సమీక్షలతో వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు.

సీఎం జగన్ - చంద్రబాబు సమీక్షలతో
చంద్రబాబు దాదాపుగా 114 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసారు. అటు సీఎం జగన్ ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ నియోజకవర్గాల పైన సమీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించటంతో, ఇప్పుడు సీఎం జగన్ ఆ నియోకవర్గాల్లో పార్టీ అభ్యర్దులను ప్రకటిస్తున్నారు. చంద్రబాబు అంచనా వేస్తున్న ముందస్తు ఎన్నికల అంచనాల పైన వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications