Chandrababu: చంద్రబాబుకు గుండె సమస్య ? హైకోర్టుకు డాక్టర్ల రిపోర్ట్..!
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆయన గుండె సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డాక్టర్లు తేల్చారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి డాక్టర్ల నివేదికను హైకోర్టుకు ఆయన లాయర్లు సమర్పించారు.

స్కిల్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఏసీబీ కోర్టు ద్వారా సీఐడీ ఆయన్ను రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపింది. 52 రోజుల తర్వాత అనారోగ్య కారణాలతో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి కంటి శుక్లాలకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోవడంతో పాటు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి ఇతర పరీక్షలు కూడా చేయించుకున్నారు. అనంతరం చంద్రబాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను హైకోర్టుకు ఆయన లాయర్లు సమర్పించారు.
హైకోర్టుకు సమర్పించిన నివేదికలో చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని, అలాగే ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని లాయర్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టుల్ని సమర్పించారు. చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని, గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయని డాక్టర్ల నివేదికను ప్రస్తావించారు. కాబట్టి చంద్రబాబు తగిన విశ్రాంతి తీసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు మధుమేహం అదుపులో ఉంచి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్పారని లాయర్లు కోర్టుకు వివరించారు.
చంద్రబాబుకు హైకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. ఎలాగో మధ్యంతర బెయిల్ పైనే ఉండటంతో రెగ్యులర్ బెయిల్ విచారణ వాయిదా వేశారు. ఇవాళ రెగ్యులర్ బెయిల్ పై ఉదయ విచారణ ప్రారంభమైంది. అనంతరం హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం నివేదికలు పరిశీలించిన హైకోర్టు రేపు మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications