Chandrababu : రేపు గన్నవరానికి చంద్రబాబు- సర్కార్ కు మరో టెన్షన్ ! అనుమతిస్తారా?
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఘర్షణలు చోటు చేసుకున్న గన్నవరానికి వెళ్లనున్నారు. అయితే ఆయన్ను ప్రభుత్వం అక్కడకు వెళ్లనిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో తాజాగా గన్నవరం నియోజకవర్గంలోచోటు చేసుకున్న ఘర్షణలు కలకలం రేపాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న దాడితో ఆగ్రహానికి గురైన ఆయన వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. విషయంతెలిసి అక్కడికి వెళ్లిన నేతలపైనా దాడులకు పాల్పడ్డారు. వాహనాలు కూడా ధ్వంసం చేశారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపైనా, పార్టీ నేతలపైనా దాడి జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించి, ఆఫీసును పరిశీలించేందుకు రేపు చంద్రబాబు గన్నవరం వెళ్లాలని నిర్ణయించారు. రేపు ఉదయం చంద్రబాబు ఉండవల్లి నుంచి బయలుదేరి గన్నవరం వెళ్లే అవకాశం ఉంది. అయితే చంద్రబాబును ప్రభుత్వం గన్నవరం వెళ్లనిస్తుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. ర్యాలీలు, సభలు లేనందున చంద్రబాబును అనుమతించే అవకాశం ఉన్నా, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది కష్టమేనని తెలుస్తోంది.

వాస్తవానికి రెండు రోజుల క్రితమే గన్నవరం ఘటనలను తెలుసుకుని ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన పట్టణంవైపు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు.దీనిపై చంద్రబాబు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేపు అయినా చంద్రబాబును గన్నవరం వెళ్లనిస్తారా, కుదరకపోతే టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా అనపర్తిలోనూ చంద్రబాబు సభ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నా టీడీపీ కార్యకర్తలు, నేతల సాయంతో ఆయన సభ నిర్వహించారు.












Click it and Unblock the Notifications