ఫలించిన చంద్రబాబు మంత్రాంగం
వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జనసేన, బీజేపీతో పొత్తు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించిన నేతలకు మొండిచెయి ఎదురుకావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు.
కొందరు నేతలైతే పార్టీ కార్యలయంపైనే దాడులు చేశారు. దీంతో టికెట్ రాని నాయకులను బుజ్జగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. తాజాగా టీడీపీ అధినేత పార్టీ అసంతృప్తి నేతలతో భేటీ అయ్యారు. దీనిలో భాగంగానే అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, గుంతకల్లు టీడీపీ ఇంఛార్జ్ జితేందర్ గౌడ్, మంత్రాలయం ఇంఛార్జ్ తిక్కారెడ్డిలతో చంద్రబాబు సమావేశం అయ్యారు.

ఈ ముగ్గురు నేతలతో భేటీ అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే పదవులు ఇస్తామని నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండు పార్టీలతో పొత్తు వల్ల సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని..అర్థం చేసుకుని పార్టీ గెలుపుకు సహకరించాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు హామీతో సంతృప్తి చెందిన ఈ ముగ్గురు నాయకులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీలో ఏర్పడిన అసంతృప్తికి తెర పడింది.
మరోవైపు పి. గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరు ప్రకటించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహాసేన రాజేష్ టీడీపీని వీడటానికి రెడీ అయ్యారు. వెంటనే అప్రమత్తం అయిన చంద్రబాబు మహాసేన రాజేష్‌తో ఫోన్లో మాట్లాడారు. పార్టీ మారవద్దని..భవిష్యత్తు మనదే అని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. టీడీపీ అధినేత చొరవ తీసుకుని నాయకులను బుజ్జగించి వారిని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే చేయడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications