అమరావతి గ్రామాల్లో చంద్రబాబు: సుదీర్ఘ విరామం అనంతరం: రెచ్చగొట్టే మంత్రం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ఈ సాయంత్రం అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఆయన పర్యటన ఆరంభం కానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ 442 రోజులుగా అమరావతి ప్రాంతంలో నిరసనలను కొనసాగిస్తోన్న రైతులకు సంఘీభావంగా చంద్రబాబు ఆయా గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. కర్నూలులోని జగన్నాథ గట్టు వద్ద హైకోర్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆ జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించిన రోజే చంద్రబాబు అమరావతి పర్యటన తలపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

4 గంటలకు తుళ్లూరు..
ఈ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు తుళ్లూరులో పర్యటిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పోలీసుల చేతిలో దాడులకు గురైన అమరావతి ప్రాంత మహిళా రైతులను ఆయన పరామర్శిస్తారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావు, వర్ల రామయ్య, ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు నేతలు ఉంటారని పార్టీ నేతలు తెలిపారు. సోమవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా అమరావతి ప్రాంత రైతులు మూకుమ్మడిగా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరగా. ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

మహిళా రైతుల అరెస్టుపై
మహిళా రైతుల పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని, అన్నం పెట్టే రైతులను అడ్డంగా చావబాదారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తోన్నారు. సాక్షాత్తూ ప్రభుత్వమే మహిళా రైతులపై దౌర్జన్యాలను ప్రోత్సహిస్తోందంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి అనుమతి ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించినప్పటికీ.. వారిని ఎందుకు అడ్డుకున్నారని నిలదీస్తోన్నారు. మహిళా రైతులను ఎందుకు అడ్డుకోవాల్సి వఛ్చిందని, వారు ఉగ్రవాదులా? నేరస్తులా అని ప్రశ్నిస్తోన్నారు. గుడికి వెళ్లడానిక్కూడా అనుమతి లభించని పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందంటూ టీడీపీ నేతలు భగ్గుమంటోన్నారు.

సుదీర్ఘ విరామం అనంతరం..
సుదీర్ఘ విరామం అనంతరం చంద్రబాబు అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది.ఇంతకుముందు- ఆయన అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలు, నిరసన సభల్లో పాల్గొన్నారు. జోలె పట్టి మరీ.. నిధులను సేకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం తాత్కాలికంగా అమరావతి ఉద్యమానికి దూరమయ్యారు. తాజాగా- స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో ఈ ఉద్యమంపై దృష్టి సారించారు. కాగా- పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమరావతి గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు పరాజయం పాలు కావడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమరావతి పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications