పెద్దాయనా.. ఈసారికి ఏమీ అనుకోవద్దు!!
మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. మార్పు సహజంగా సంభవించే పరిణామం. నేనిలానే ఉంటాను అని భీష్మించుకు కూర్చుంటే జీవితమనే పరుగు పందెంలో వెనకబడిపోతాం. రాజకీయ నాయకులకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు యువతనే పార్టీలోకి తీసుకున్నారు. వారంతా ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. కానీ ఇవ్వమంటూ కూర్చుంటే వారు మారలేదని అర్థం. దీంతో అధిష్టానమే కటువైన నిర్ణయాలు తీసుకుంటోంది.

సహజశైలికి విరుద్ధంగా చంద్రబాబు
చంద్రబాబునాయుడి దగ్గర ఉన్న మెతకతనాన్ని ఆసరాగా తీసుకొన్ని ఇన్ని సంవత్సరాలు ఇష్టారాజ్యంగా నియోజకవర్గాల్లో అధికారం చెలాయించి సీనియర్లుగా చెలామణి అయినవారందరినీ పార్టీ ఇప్పుడు పక్కన పెడుతోంది. వచ్చే ఎన్నికలు పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి కావడంతో చంద్రబాబునాయుడు కూడా తన సహజశైలికి విరుద్ధంగా వ్యవహరిస్తూ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.

పార్టీకి తెల్ల ఏనుగులాంటివారంటున్న శ్రేణులు
వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓటమిపాలైనవారికి టికెట్లు లేవని మహానాడు సమయంలోనే ప్రకటించారు. అయినప్పటికీ కొందరు తమ కుమారులు, కుమార్తెలు, బావమరుదల కోసం సీట్లబేరాలు ప్రారంభించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు ఖర్చుపెట్టుకోవడానికి కూడా కొందరు సీనియర్లు ముందుకు రాలేదు. ఇటువంటివారంతా పార్టీకి తెల్ల ఏనుగులాంటివారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అందుకు ఉదాహరణగా డోన్ నియోజకవర్గాన్ని చూపిస్తున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి పార్టీలో హవా చెలాయిస్తున్న కేఈ సోదరులకు టికెట్ కేటాయించలేదు. ధర్మవరం సుబ్బారెడ్డికి ప్రకటించి పనిచేసుకోవాలని అధిష్టానం సూచించింది. పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నేతలందరికీ ఇది వార్నింగ్ లాంటిదని చెబుతున్నారు.

తెరపైకి వస్తోన్న యువ నాయకత్వం
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. యువతకు 40 శాతం సీటిస్తానని ప్రకటించారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో టికెట్లు పొందిన యువతరం నేతలకు నాయకత్వ మెళకువలు నేర్పి భవిష్యత్తు రాజకీయ నేతలుగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ పదవులతోపాటు ప్రభుత్వ పదవులు కూడా పొంది పార్టీ కష్టకాలంలో ఉన్న ఆర్థికంగా ఆదుకోవడానికి సీనియర్ నేతలెవరూ ముందుకు రావడంలేదు. ఇటువంటివారిని తప్పించాలంటూ పార్టీలోని యువ నాయకత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో యువ నాయకత్వం తెరపైకి వస్తోంది. ఒక్క డోన్ నియోజకవర్గమనే కాకుండా చాలా నియోజకవర్గాల్లో సీనియర్లను మార్చబోతున్నట్లు తెలుస్తోంది. విజయమే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications