టీడీపీకి 112 సీట్లు-జనసేనకు 63 సీట్లు ? - క్లారిటీ ఇదే..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకున్న టీడీపీ-జనసేన ఉమ్మడిగా ముందుకెళ్తున్నాయి. అలాగే త్వరలో సీట్ల పంపకాలు కూడా పూర్తి చేసి ఉమ్మడి మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తామని కూడా చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేనకు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కేటాయించాలనే ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారిని ఉద్దేశించి రాసిన ఓ లేఖ చక్కర్లు కొడుతోంది.
అచ్చెన్నాయుడు ఈ లేఖలో తమ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీకి ఈసారి 63 సీట్లు కేటాయిస్తున్నందున తాము 112 సీట్లలో సరిపెట్టుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు ఈ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ విజయం కోసం ప్రతీ ఒక్కరూ పనిచేయాలని అచ్చెన్నాయుడు కోరారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

రాష్ట్రంలో జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీ ఆ పార్టీకి దాదాపు 30 సీట్లకు కాస్త అటు ఇటుగా కేటాయించే అవకాశం ఉందని ఇంతకు ముందు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా 63 సీట్లు కేటాయిస్తున్నట్లు అచ్చెన్నాయుడు పేరుతో విడుదలైన ప్రకటనతో ఇరు పార్టీల్లోనూ కలకలం రేగింది. దీనిపై టీడీపీ వెంటనే స్పందించింది. ఈ లేఖ ఫేక్ అని తేల్చేసింది. ఇరు పార్టీల మధ్య ఇలాంటి సీట్ల పంపకాలు జరగలేదని తెలిపింది.
పొత్తులో భాగంగా తెలుగుదేశంకు 112 అసెంబ్లీ స్థానాలు,జనసేన కు 63 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తూ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పేరుపై విడుదలైన లేఖలో ఏ మాత్రం నిజం లేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ లేఖ ఫేక్ అని, ఇలాంటి ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ అడ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపింది.












Click it and Unblock the Notifications