హైదరాబాద్ ఆస్తుల కోసమే!: కేసీఆర్‌కు మద్దతిచ్చి చిక్కుల్లో జగన్?
హైదరాబాద్: శాసన మండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాసకు మద్దతిచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారా? అంటే అవుననే అంటున్నారు. తెరాసకు మద్దతివ్వడంపై కాంగ్రెస్, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఏపీలో రాజకీయ విభేదాలు ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న తెరాసకు మద్దతివ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని, అలాంటప్పుడు ఆయనకు మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
తెరాసకు మద్దతివ్వడంపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బాబుపై అక్కసుతోనే తెరాసతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని ఆరోపించారు.

కేసీఆర్‌కు జగన్ మద్దతు వెనుక హైదరాబాదులోని తన ఆస్తులను కాపాడుకునేందుకేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా జగన్‌ను టార్గెట్ చేసింది. తెరాసకు మద్దతివ్వడంతో జగన్ అసలు స్వరూపం బయటపడిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు.
విభజనలో జగన్ పాత్ర ఉందని, దానిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. విభజనకు కారణమైన కేసీఆర్‌తో జగన్ ఎలా కలుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, చంద్రబాబును దెబ్బతీసేందుకే తాను తెరాసకు మద్దతు పలికానని, ఇది ప్రస్తుతానికేనని, తెరాస ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని వైసీపీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications