బీజేపీపై ఎదురుదాడికి జంకుతున్న టీడీపీ: మంత్రులు ఏమన్నారంటే?

అమరావతి: విజయవాడలో శుక్రవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి సిద్ధార్ద్ నాథ్ సింగ్... ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని చెప్తూనే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రం వద్ద ఏపీకి ప్రత్యేకహోదా విషయాన్నే ప్రస్తావించలేదని చెప్పారు.

అంతేకాదు ఏపీకి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల సాయం చేసిందుకు ముందుకొచ్చిందనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా కేంద్రం ఏపీకి చాలా చేస్తున్నప్పటికీ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపై టీడీపీ నేతలు చేసే విమర్శలను సహించేది లేదని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో టీడీపీ చెందిన మంత్రులు బీజేపీ నేతలపై ఎదురుదాడికి జంకుతున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేకహోదాపై టీడీపీ, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు.

ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో వెంకయ్య పోరాడారని, పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని ఈ విషయం కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అంగీకరించారని తెలిపారు. చట్టం కన్నా ప్రధాని ప్రకటనకే ఎక్కువ విలువ ఉంటుందని పేర్కొన్నారు.

TDP Dokka Manikya Vara Prasad Rao Fires On YS jagan

రెండు పార్టీలు కలిస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొచ్చని మంత్రి గంటా అభిప్రాయపడ్డారు. మరో మంత్రి రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై త్వరలో ప్రధాని మోడీతో భేటీ అవుతామని తెలిపారు. టీడీపీ-బీజేపీ మధ్య వివాదాలు ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

చంద్రన్న చేయూత కార్యక్రమపై విజయవాడలో వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్‌లో మంత్రి రావెల లక్షమంది దళిత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పనకు అనుగుణంగా 64 కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలపై ఈనెల 17న వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని తెలిపారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు: డొక్కా

వైసీపీ అధినేత వైయస్ జగన్ దీక్షల పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, ఆ ప్రయత్నాలను మానుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ సున్నితమైన అంశాలను రాజ‌కీయం చేయవ‌ద్ద‌ని ఆయ‌న జ‌గ‌న్‌ను కోరారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తోంద‌ని, కేంద్రంతో కలిసిపని చేస్తూనే హోదా సాధిస్తామన్నారు. ఏపీ అభివృద్ధి హోదాతోనే ముడిపడి ఉందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం త‌మ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నార‌ని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై కూడా ఆయన స్పందించారు. కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకుండా, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టుల వల్ల ఏపీ రైతుల హక్కులకి భంగం కలుగుతుందన చెప్పారు. కర్నూలులో వైయస్ జగన్ తలపెట్టిన జలదీక్ష వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు.

పోలవరం, పట్టిసీమను జగన్‌ అడ్డుకుంటున్నారు: మంత్రి దేవినేని

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం, పట్టిసీమను వైసీపీ అధినేత వైయస్ జగన్‌ అడ్డుకుంటున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి దేవినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్‌పై నిప్పులు చెరిగారు.

పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని ఆదా చేశామని అన్నారు. టీఆర్ఎస్‌లో పొంగులేటి చేరడాన్ని ప్రస్తావిస్తూ, జగన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే పొంగులేటి ఆ పార్టీలో చేరాడని, అందుకు ప్రతిగా పలువురు వైసీపీ నేతలకు కేసీఆర్ ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చాడని ఆరోపించారు.

ఓ వైపు కాంట్రాక్టులను పొందుతూ, మరోవైపు కర్నూలులో దీక్ష చేస్తాననడం జగన్నాటకమని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులను కలిసిన జగన్ ఏం సాధించాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, కడప జిల్లాకు నీరిచ్చినా జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

ఒంగోలులో మంత్రి ప్రత్తిపాటి

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో రెండో పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి రైతులను పొగాకు ధరలు అడిగి తెలుసుకున్నారు. ధరలపై బోర్డు అధికారులు అసత్యాలు చెబుతున్నారని రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. పొగాకు ధరలపై వ్యాపారులు సిండికేట్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు .సిండికేట్ అయితే వేలం నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+