జనసేన అడ్డాలో అభ్యర్ధుల్ని పోటీ పెడుతున్న టీడీపీ! ఏం జరగబోతోంది?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే తాజాగా ఓ అంశంలో మాత్రం టీడీపీ,జనసేన మధ్య ఓ అంశంలో విభేదాలు తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో త్వరలో జరిగే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు కారణమవుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఐక్యతకు ఇవి సవాల్ విసిరేలా ఉన్నాయి.
త్వరలో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ రెండు సీట్లలోనూ తమ అభ్యర్ధుల్ని పోటీకి దించేందుకు కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ సిద్ధమవుతోంది. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ రెండు సీట్ల పరిధిలోనూ నిలబడుతున్న అభ్యర్ధులు గత ఎన్నికల్లో సీట్లు ఆశించి విఫలమైన వారే. అలాగే జనసేనకు సీట్ల కేటాయింపు కారణంగా తమ అవకాశాలు పోగొట్టుకున్న వారే. దీంతో ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీరికి సదరు జనసేన ఎమ్మెల్యేల నుంచి లభించే సహకారంపై చర్చ జరుగుతోంది.

ఉమ్మడి కృష్ణా,గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానంలో టీడీపీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అవకాశం ఇస్తున్నారు. తెనాలిలో పలుమార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఆయనకు ఈసారి మాత్రం జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ కారణంగా సీటు దక్కలేదు. దీంతో ఆలపాటి రాజాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించే విషయంలో తెనాలి జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పాత్ర కీలకం కాబోతోంది.

అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానంలో టీడీపీ పేరాబత్తుల రాజశేఖర్ కు అవకాశమిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు. అయితే జనసేన అభ్యర్ధి పంతం నానాజీ కారణంగా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు అదే పంతం నానాజీ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిలబడుతున్న టీడీపీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాల్సిన పరిస్దితి నెలకొంది. దీంతో ఈ రెండు సీట్లలో జనసేన ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారిపోతోంది.












Click it and Unblock the Notifications