Tdp Foundation Day: టీడీపీ పదవులపై లోకేష్ ఫార్ములా..! రెడ్ బుక్ పేరెత్తితే గుండెపోటు..!

ఎత్తిన పసుపు జెండా దించని సైన్యమే మన బలమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో లోకేష్ మాట్లాడారు. కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా, బయటా పోరాడతానని లోకేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పనిచేసే వారికే పదవులు ఇవ్వాలన్నది తమ విధానమని, పార్టీలో యువరక్తం నింపేందుకు సహకరించాలని నేతల్ని కోరారు. సంక్షేమ సారధి ఎన్టీఆర్... అభివృద్ధి ప్రదాత చంద్రన్న అని తెలిపారు.

పసుపు జెండా ఎమోషన్

పసుపు జెండా తమకు ఎమోషన్ అని, 43 ఏళ్ల ప్రయాణం లో ఎన్నో విజయాలు, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నామని నారా లోకేష్ తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని కేడర్ తమకు మాత్రమే సొంతమన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనమని, మొదటి గెలుపు ఓ చరిత్ర, రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యమని చెప్పుకొచ్చారు. మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయని, ఆ మూడు అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయని తెలిపారు. ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్ అన్నారు.

Tdp Foundation Day nara Lokesh hints at youth priority in party satires on ys jagan

కరుడుగట్టిన సైన్యమే బలం

నందమూరి తారకరామారావు 43 ఏళ్ల క్రితం టీడీపీకి పునాది వేసారని, ఆ ముహూర్తబలం గొప్పదని లోకేష్ తెలిపారు. పునాది గట్టిదన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసిన దమ్మున్న నాయకుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. 43ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం అన్నారు. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టిడిపి, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం అన్నారు. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్ము అన్నారు.

ఎన్టీఆర్ చేసిందిదే..

సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, పార్టీ ఆవిర్భావం నుండి నేటివరకూ ఎన్నికష్టాలు ఎదురైనా అదే స్పూర్తితో పనిచేస్తున్నామని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అని, దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన పేదల పెన్నిధి చంద్రన్న అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్ అని, తెలుగువారిని ప్రపంచపటంలో పెట్టింది చంద్రన్న అని తెలిపారు. రూ.2లకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తిహక్కు, వృద్ధాప్య పింఛను లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి టీడీపీ పరిచయం చేసిందన్నారు. చదువుకున్న యువతకు సీట్లు ఇచ్చి, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, బిసిలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది టిడిపి అన్నారు.

గల్లీ తెలుసు... ఢిల్లీ తెలుసు!

తమకు గల్లీ పాలిటిక్స్ తెలుసని, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసని నారా లోకేష్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్దానికి వాడుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టిడిపి అన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో తమ కృషి ఉందని, జిఎంసి బాలయోగిని పార్లమెంట్ కు మొదటి దళిత స్పీకర్ చేసింది తామేనన్నారు. అంబేద్కర్‌ కు భారతరత్న రావడంలో కీలకపాత్ర పోషించామన్నారు. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్ ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించామన్నారు. టీడీపీ జెండా పీకేస్తామని వచ్చిన వారు అడ్రెస్స్ లేకుండా పోయారన్నారు.

Tdp Foundation Day nara Lokesh hints at youth priority in party satires on ys jagan

జగన్ పై లోకేష్ పంచ్ లు

2019 వరకూ మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకూ మనం చూసిన రాజకీయం వేరని లోకేష్ తెలిపారు. అయిదేళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నామన్నారు. మన దేవాలయంపై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డామన్నారు. అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామన్నారు. క్లైమోర్ మైన్ల కే భయపడని బ్లడ్ మనదన్నారు. కామిడీ పీసులకు భయపడతామా? అని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపామన్నారు. ప్యాలెస్ లు బద్దలు కొట్టామని, 2024 ఎన్నికల్లో 94 శాతం స్ట్రయిక్ రేట్ అన్నారు. 58 శాతం ఓట్ షేర్ తో 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ చేశామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించామన్నారు.

కార్యకర్తలకు గుర్తింపుపై లోకేష్

టీడీపీలో కార్యకర్తే అధినేత అని లోకేష్ తెలిపారు. ఈ మాట తాను ఊరికే అనడం లేదని, దేశంలో కార్యకర్తలకు గౌరవం ఇచ్చే ఒకే ఒక్క పార్టీ టిడిపి అన్నారు. మంచి చేస్తే మెచ్చుకుంటారని, తప్పు చేస్తే తాట తీస్తారని తెలిపారు. కోటి సభ్యత్వాలు అనేది ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డు అన్నారు. దాన్ని సాధించామన్నారు. కేవలం 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేశామని, ఏపీలో కోటి 53 వేల 551 సభ్యత్వాలు, తెలంగాణాలో లక్షా 78 వేల సభ్యత్వాలు.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు 1 కోటి 2 లక్షల 35 వేల 857 సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. ప్రమాద బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని, కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.140 కోట్లు ఖర్చు చేశామన్నారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని, 2004లో ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివించి ఉద్యోగాలకు వచ్చేవరకు నిలబడింది చంద్రబాబు అన్నారు . పాదయాత్రలో ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలను కలిశానని, ప్రస్తుతం వారు వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయికి చేరారన్నారు. దేశ చరిత్రలో ఏ పార్టీలో అది జరగలేదన్నారు.

పనిచేసే వారికి ప్రమోషన్

కార్యకర్తల కోసం తాను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతానని లోకేష్ తెలిపారు. తన లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే అన్నారు. గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది తన కోరిక అన్నారు. రెండు టర్మ్ లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలని ప్రతిపాదించానని, ఇది జరిగితే పార్టీలో కదలిక వస్తుందన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాలుగోసారి పనిచేస్తున్నానని, పార్టీలో ప్రక్షాళన తనతోనే మొదలు పెట్టాలని కోరారు. సీనియర్లను గౌరవిస్తానని, పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తానని తెలిపారు.. పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలన్నారు. పనిచేసిన వారికే పదవి అనేది తన విధానమని, నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తామన్నారు. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తామని, త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు.

రెడ్ బుక్ పేరెత్తితే గుండెపోటు

ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారని, రెడ్ బుక్ గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని లోకేష్ తెలిపారు. రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తుందన్నారు. కొంతమంది బాత్ రూం లో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారని, అర్దం అయ్యిందా రాజా అని సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నాం అని గర్వం వద్దని, ఇగో వద్దని, అందరం కలిసి పనిచేద్దామన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటేనే మనం ఉంటామన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని, ప్రజల మనసు గెలిచేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు నిరంతరం శ్రమించాలని లోకేష్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+