టీడీపీతో పొత్తు, జనసేన సీట్లు ఫిక్స్ - ఆ రూటులోనే వారాహి..!!
ఏపీలో పొత్తులపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. టీడీపీ, జనసేన పొత్తు ఇక అధికారకమే. పవన్ గతంలో చెప్పినట్లుగా పొత్తుల గురించి ఇప్పుడు వారాహి యాత్రలో ప్రస్తావన చేయకపోయినా..పక్కా వ్యూహంతోనే అడుగులు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు..మొత్తంగా మాత్రం 25-30 సీట్ల వరకు టీడీపీ అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ తాను చేయించుకున్న సర్వేల ఆధారంగా ఇప్పుడు పోటీ చేసే సీట్లలోనే వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు.
రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ : టీడీపీ, జనసేన పొత్తుతో సీట్ల పంపకాల పైన రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీలో ఎంతో కాలంగా పని చేస్తున్న సీనియర్లు ఎవరు సీట్లు పొత్తులో భాగంగా కోల్పోవాల్సి వస్తుందనే టెన్షన్ వెంటాడు తోంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు తాము టీడీపీతో సీట్ల చర్చలు చేయలేదని జనసేనాని స్పష్టం చేసారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ పలు సర్వేలు చేయించారు. తనతో సహా తన పార్టీకి పట్టున్న నియోజకవర్గాల గురించి సమాచారం సేకరించారు. ఆ జాబితా ఆధారంగానే వారాహి రూట్ మ్యాప్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు పోటీ చేసే సీట్ల పైన జాబితా కు టీడీపీ నో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

పోటీ చేసే స్థానాల్లో వారాహి యాత్ర : పొత్తులో భాగంగా జనసేన..శ్రీకాకుళం జిల్లాలో ఒక స్థానం కోరుతోంది. విజయనగరం జిల్లాలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ నగరం నుంచి తిరిగి గాజువాక జనసేన పోటీ చేయనుంది. అదే విధంగా రూరల్ ప్రాంతంలోని మాడుగుల పైన చర్చ జరుగుతోంది. వారాహి యాత్ర ఇప్పటికే పూర్తయిన పిఠాపురం, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలు తో పాటుగా అమలాపురం నుంచి జనసేన బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. రాజానగరం పైన స్పష్టత రావాల్సి ఉంది. పశ్చిమ గోదావరిలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, నిడదవోలు జనసేకు ఖాయమైనట్లు సమాచారం. అదే విధంగా.. అవనిగడ్డ పెడన, కైకలూరు జనసేకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి వంగవీటి రాధా పోటీ ఖాయమని సమాచారం.
బీజేపీ తేల్చాక ఫైనల్ లిస్టు : గుంటూరు జిల్లాలో తెనాలి..గుంటూరు పశ్చిమం పైన రెండు పార్టీల నుంచి డిమాండ్ ఉంది. ప్రత్తిపాడు జనసేనకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. దర్శి నుంచి జనసేన బరిలోకి దిగనుంది. నెల్లూరు సిటీ.. తిరుపతి తో పాటుగా రాజంపేట జనసేకు కేటాయిస్తారని తెలుస్తోంది. రెండు పార్టీల కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా మందుగానే సీట్ల పైన నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేనకు మూడు ఎంపీ స్థానాలు ఇస్తారని సమాచారం. అందులో కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం పైన చర్చ జరుగుతోంది. జనసేన నుంచి మరిన్ని సీట్ల కోసం డిమాండ్ ఉన్నా..టీడీపీ నుంచి పోటీ ఉండటంతో పాటుగా బీజేపీ పొత్తులపైన నిర్ణయం ప్రకటించిన తరువాత ఫైనల్ లిస్టు ఖరారు చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications