ఏపీలో ముందస్తు కూత ! ముందే చెప్పిన పవన్ ! విపక్షాల వ్యూహరచన ఇలా..
ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్ సభ ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్లోనే నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాడి జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు మరిన్ని రాష్ట్రాలను చేర్చి దాదాపు జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిన్న ప్రధాని మోడీతో సీఎం జగన్ ఈ మేరకు ముందస్తు ఎన్నికలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్ధితులతో ముందస్తు ఎన్నికలకు వెళితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ముందస్తుకు జై కొట్టినట్లు సమాచారం. ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ తర్వాత ముందస్తు ఎన్నికలపై సంకేతాలు బలపడటంతో రాష్ట్రంలో విపక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి.

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగాలంటే ముఖ్యంగా రెండు పార్టీల ఆమోదం తప్పనిసరి. అవి వైసీపీ, బీజేపీ. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు ముందస్తుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ ఏపీ అధ్యక్ష పదవిని దగ్గుబాటి పురంధేశ్వరికి అప్పగించినట్లు తెలుస్తోంది. తద్వారా బీజేపీ తొలి అడుగు వేసింది. ఇప్పుడు టీడీపీ,జనసేన కూడా తదుపరి అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ తరఫున నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకున్న యువగళం పాదయాత్ర ముందస్తు ఎన్నికల లెక్కల ప్రకారం చూసినా ఈ ఏడాది చివరికి శ్రీకాకుళం జిల్లాకు చేరి ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కూడా వరుసగా జిల్లాల టూర్లకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మినీ మ్యానిఫెస్టోను ప్రకటించిన టీడీపీ.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలు నిర్వహిస్తోంది. అదే సమయంలో దసరా నాటికి పూర్తి మ్యానిఫెస్టో ప్రకటనతో పాటు జనసేనతో పొత్తును కూడా ప్రకటిస్తే ముందస్తు ప్రయోజనం పొందవచ్చని ఆశిస్తోంది.
ఏపీలో ముందస్తు ఎన్నికల హడావుడితో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. వరుసగా నియోజకవర్గ ఇన్‍ఛార్జ్ లను ఫైనల్ చేస్తున్నారు. టీడీపీ రోజూ మూడు లేదా నాలుగు నియోజకవర్గాల ఇన్‍ఛార్జ్ లతో భేటీ అయి...సీట్లను ఖరారు చేస్తున్నారు. ఇవాళ కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్న చంద్రబాబు..నిన్న తిరువూరు, పోలవరం(ఎస్టీ), సుళ్లూరుపేట, సంతనూతలపాడుపై సమీక్షించారు. మొన్న పత్తిపాడు, చింతలపూడి, గోపాలపురం, కోడుమూరు నియోజకవర్గాల సమీక్షించారు.
అటు జనసేన కూడా ప్రజల్లోకి విస్తృతంగా పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పవన్ వారాహి యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఓ రౌండ్ పూర్తయింది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తమకు ఎక్కువ స్ధానాలు రావాల్సిందేనని భావిస్తున్న జనసేన.. త్వరలో మరో రౌండ్ కూడా ఇక్కడే నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. వారాహి యాత్ర రెండో దశలో ఉత్తరాంధ్రను కవర్ చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో దీని షెడ్యూల్ కూడా విడుదల కానుంది.

ఇలా ఏపీలో ముందస్తు ఎన్నికల కోసం విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పవన్ ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని ముందే చెప్పేశారు. దానికి అనుగుణంగానే పవన్ ప్లాన్ సిద్దం చేసుకుంటుండగా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తమ శ్రేణులకు పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహాలకు పోటీగా విపక్షాలు కూడా నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రతివ్యూహం సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఈసారి పోరు రసవత్తరంగా మారనుంది.












Click it and Unblock the Notifications