బీజేపీని ఆశ్రయించడంపై నారా లోకేష్ ఏమనుకుంటున్నారు?
TDP BJP Alliance: ఊహించినట్టే- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా చర్చలు కొనసాగించడం, షరతులకు ఓకే చెప్పిన తరువాతే ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఎన్డీఏ నుంచి.
ఇటీవలే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తు విషయంపై చర్చించారు. సీట్ల పంపకాలపైనా తుది నిర్ణయాలను తీసుకున్నారు. బీజేపీకి కేటాయించాల్సిన సీట్లపై చంద్రబాబు నుంచి స్పష్టత తీసుకున్నారు.

దీనితో ఎన్డీఏలో చేరికకు అంగీకరించారు అమిత్ షా, జేపీ నడ్డా. దీనిపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ- టీడీపీ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికీ టీడీపీ సహకారాన్ని అందించిందని గుర్తు చేసింది.
బీజేపీతో పొత్తు కుదరడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ పొత్తును తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి విజయానికి ఎదురు ఉండబోదని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తామని అన్నారు.
ఏపీని అభివృద్ధిపథంలోకి తీసుకుని రావడానికి ప్రతిపక్షాలు కూటమి కట్టాల్సిన అవసరం ఏర్పడిందని నారా లోకేష్ చెప్పారు. అయిదు సంవత్సరాలుగా చీకటిలో మగ్గుతున్న ఏపీకి.. ఇదొక సువర్ణ అవకాశమని వ్యాఖ్యానించారు. ఈ కూటమి- రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను బాగు పరుస్తుందని, ఇదొక కీలక మలుపుగా మారుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications