బీజేపీ పొత్తు ఎఫెక్ట్- టీడీపీ, జనసేన సీట్లలో మార్పులు...!!
ఏపీలో పొత్తులు ఖాయమయ్యాయి. కూటములు ఖరారయ్యాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు - పవన్ అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలోనే పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 8 ఎంపీ - 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం ఖాయమైంది. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. ఈ సమయంలోనే ఇప్పటికే టీడీపీ, జనసేన పోటీ చేసే సీట్లుగా ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఎంట్రీతో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.
పొత్తుల్లో ఎవరెక్కడ : పొత్తులో భాగంగా టీడీపీ 94 అసెంబ్లీ, జనసేన 5 స్థానాలకు తమ అభ్యర్దులను ప్రకటించారు. ఇప్పుడు బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి. ఎవరు ఏ ఎంపీ స్థానంలో పోటీ చేయాలనే అంశం పైన ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. అధికారికంగా నిర్ణయం జరగలేదు. ఎమ్మెల్యే స్థానాల్లోనూ కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసే, బీజేపీకి ఇచ్చే సీట్ల పైన ఇప్పటికే చంద్రబాబు ఆ నియోజకవర్గాల ఇంఛార్జ్ లకు సమాచారం ఇస్తున్నారు. వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. ఇటు పవన్ కల్యాణ్ సైతం ఆశావాహులతో మాట్లాడుతున్నారు. జనసేనకు తొలుత మూడు ఎంపీ స్థానాలు ఇవ్వగా, ఇప్పుడు రెండింటికి పరిమితం కానుంది. కాకినాడ, మచిలీపట్నం లేదా నర్సాపురం స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది.

ఎవరికి ఎన్ని సీట్లు : అనకాపల్లి స్థానం బీజేపీ తీసుకుంటే అక్కడ ఎమ్మెల్సీగా పని చేసిన మాధవ్, జవీఎల్ పోటీ పడుతున్నారు. అదే స్థానం సీఎం రమేశ్ ఆశిస్తున్నారు. రాజమండ్రి నుంచి పురందేశ్వరి పేరు ప్రచారంలో ఉంది. రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి ఇప్పటికే టీడీపీ అభ్యర్దిగా ఆదిరెడ్డి వాసు పేరు ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానంలో బీజేపీ అభ్యర్ది సోము వీర్రాజు పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన తాడేపల్లి గూడెం సీటు తమదేనని భావిస్తుండగా..ఆ సీటును బీజేపీ కోరుతోంది. శ్రీకాళహస్తి, తిరుపతి స్థానాలను జనసేన కోరుకుంటోంది. ఇందులో శ్రీకాళహస్తి బీజేపీ కి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. విజయవాడ సెంట్రల్ ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్దిగా బోండా ఉమాను ప్రకటించింది. అక్కడ బీజేపీ తమ అభ్యర్దిని బరిలోకి దించే అంశం పైన ప్రతిపాదన చేసింది.

మూడు పార్టీల కసరత్తు : ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతి, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం లో ఆరు స్థానాలను బీజేపీకి కేటాయించాల్సి ఉంది. బీజేపీ విశాఖ కోసం పట్టు బడుతోంది. అనకాపల్లి బీజేపీకి ఇవ్వటానికి నిర్ణయించటంతో విశాఖ సీటు నుంచి టీడీపీ పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు. అదే విధంగా రాజమండ్రి, ఏలూరు రెండు స్థానాల్లో ఒకటే బీజేపీకి దక్కనుంది. నిడుదవోలు నుంచి జనసేన నేత కందుల దుర్గేష్ పోటీకి సిద్దం అవుతున్నారు. అక్కడ టీడీపీ నేతలు తమకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పొత్తుల లెక్కలతో టీడీపీ మూడు సీట్లు మైనార్టీలకు కేటాయిస్తోంది. ఇప్పటికే నంద్యాల ఇవ్వగా, మదనపల్లె, గుంటూరు తూర్పు స్థానాలను టీడీపీ మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ సీట్ల ఖరారు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications