వర్రా రవీంద్ర రెడ్డికి వైసీపీ నుంచే ప్రాణహాని- బీటెక్ రవి ఆందోళన
BTech Ravi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్ర రెడ్డి అరెస్టయినట్లు వస్తోన్న వార్తలపై తెలుగుదేశం పార్టీ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన అరెస్ట్ అయినట్లు న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో చూస్తోన్నామని, ఇది ప్రచారం మాత్రమే అయివుండొచ్చని చెబుతోంది.
వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ కాలేదంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారని టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి గుర్తు చేశారు. ఆయన అరెస్ట్ అయ్యాడంటూ వైసీపీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్లల్లో మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని, ఆయన తప్పించుకున్నాడంటూ మళ్లీ వాళ్లే ప్రచారం చేస్తోన్నారని చెప్పారు.

ఇదంతా చూస్తోంటే దీని వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందని బీటెక్ రవి అనుమానాలను వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లే వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని కలిగించి, ఆ నెపం అంతా కూడా ఏపీ పోలీసులు, తెలుగుదేశం పార్టీ మీద వేయాలనే కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందని బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ ఎంతకైనా తెగిస్తుందని, ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుందని బీటెక్ రవి విమర్శించారు. వర్రా రవీంద్రరెడ్డి ప్రాణహాని కలిగితే అది ఏపీ పోలీసులు, టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం మీద పడుతుందని, అతని ప్రాణానికి ముప్పు ఉందన అభిప్రాయపడుతున్నట్లు తేల్చి చెప్పారు.
పీఏ రాఘవరెడ్డితో రవీంద్రారెడ్డి టచ్‌లోనే ఉన్నాడని, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అనేక విషయాలు బయటికొస్తాయని బీటెక్ రవి చెప్పారు. త్వరగా వర్రా రవీంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని, కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రవీంద్రా రెడ్డికి ప్రాణహాని తలపెట్టి దాన్ని పోలీసుల మీదికి నెట్టే ప్రమాదం ఉందని తాను హెచ్చరిస్తోన్నానని అన్నారు.
తనపై కేసులు నమోదైనప్పటి నుంచి వర్రా రవీంద్రా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. తొలుత ఆయన అరెస్ట్ అయినట్లు వార్తలొచ్చినప్పటికీ, ఆయన కోసం ఇంకా నాలుగు బృందాలతో గాలిస్తోన్నామంటూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆయన కదలికలపై నిఘా పెట్టామని, హైదరాబాద్ వెళ్తున్నట్లుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించామని కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఫోన్ ఆఫ్ చేయడం వల్ల సిగ్నల్ లభించలేదని, దీనితో రవీంద్ర రెడ్డి కోసం గాలిస్తున్నామని వివరించారు. త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications