భూతం, సైతాన్ ఉంటే రాష్ట్రానికి ఎవరూ రారు: చంద్రబాబునాయుడు
ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఒంగోలులో తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న ఆంధ్ర, తెలంగాణ యువత పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో వర్చువల్‌గా ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, దాని భవిష్యత్తు ఏమిటి? రాజధాని పరిస్థితి.. ఇలా పలు ప్రశ్నలు అడిగి వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఆయన మాటల్లోనే..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్మాదులు, రౌడీలు పారిపోతారు. ప్రస్తుతానికి రాష్ట్రాన్ని కొంత నాశనం చేశారు. దాన్ని బాగుచేయడానికి సమయం పడుతుంది. ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక భూతం, ఒక సైతాన్ ఉంటే రాష్ట్రానికి పెట్టబడులు పెట్టడానికి వచ్చేవారు కూడా రారు. ఇటువంటివారికి రాజకీయంగా అర్హత ఉందా? లేదా? అనేది ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలి. విధ్వంసం చేసేవారుంటే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తాను.

40 శాతం టికెట్లు యువతకే
నేను యువతగా ఉన్న రోజుల్లో విద్యుత్తు సరఫరా లేదు.. రోడ్లు లేవు. కానీ ఇప్పుడు అంతా మోడరనైజేషన్ అయిపోయింది. ఐటీ వచ్చింది. అందుకే దీర్ఘకాలికంగా రాజకీయాల్లో నిలబడేందుకు ఆసక్తి ఉన్న యువతను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందుకు వచ్చేవారిని గుర్తించి, వారికి నాయకత్వ లక్షణాలపై తెలుగుదేశం పార్టీయే శిక్షణ ఇస్తుంది. ఎక్కడా నాయకత్వ సమస్య ఎదురు కాకూడదని ఇప్పటినుంచే నాయకులను తయారుచేయాలనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో 100కు 40 శాతం యువతకే టికెట్లు కేటాయించబోతున్నాను. అందులో నుంచే భవిష్యత్తు నాయకులు పుట్టుకొస్తారు.

దిశ చట్టం అసలు లేదు..
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. లేని చట్టాన్ని ఉన్నట్లు చెప్పారు. వాస్తవానికి చట్టం లేదు. కేంద్రం, రాష్ట్రం కలిసి కొన్ని చట్టాలు చేయాలి. మనం చేసిన చట్టాన్ని కేంద్రం అంగీకరించాలి. కానీ వారు దిశ చట్టాన్ని నిరాకరించారు. అది పెండింగ్‌లోనే ఉంది. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా చెబుతుండటం ఈ ప్రభుత్వం చేసే మొదటి తప్పు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గురజాల ప్రాంతంలో ఒక యువతి అత్యాచారానికి గురైంది. నిందితుడిని పట్టుకోవడం కోసం గురజాల ప్రాంతంలో 20 బృందాలతో పోలీసులను పంపిస్తే ఒత్తిడి తట్టుకోలేక నిందితుడు చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ఆ తర్వాత విజయవాడలో మహిళల రక్షణ కోసం ర్యాలీలు నిర్వహించాం.

అలిపిరిలో వెంకటేశ్వరస్వామే కాపాడాడు
అలిపిరిలో నామీద 24 క్లైమోన్లు వేశారు. దేవుడు కాపాడాడు. రాయలసీమలో ముఠాకక్షలు ఉండకుండా చూశాం. ఇప్పుడు అక్కడ ఫ్యాక్షన్ లేదు. అధికారంలో ఉన్నవారు రౌడీయిజం చేస్తున్నారుకానీ అక్కడ ఫ్యాక్షన్ అంతమైంది. హైదరాబాద్‌లో కూడా హిందూ ముస్లిం గొడవలు లేకుండా కట్టడి చేశాను.












Click it and Unblock the Notifications