తన్నుకుంటున్న తమ్ముళ్లు - అదుపు చేసేదెవరు..!!
టీడీపీ నాయకత్వానికి ఆ పార్టీ నేతలే పరీక్షగా మారారు. రాయలసీమ జిల్లాల్లోని పలు నియోజక వర్గాల్లో నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆధిపత్య పోరు వర్గాల వారీగా కొట్టుకొనే వరకూ వెళ్తోంది. నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు బల ప్రదర్శనకు వేదికగా మారుతున్నాయి. ఇంఛార్జ్ మంత్రుల ముందే బాహా బాహీకి దిగుతున్నారు. హైకమాండ్ హెచ్చరికలు పట్టించుకోకుం డానే ఘర్షణలు కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్న వేళ.. ఈ పరిణామాలు పార్టీ నాయకత్వానికి సమస్యగా మారుతున్నాయి.
టీడీపీలో రాయలసీమలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలు వారి అనుచర వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతున్నాయి. పులివెందులలో బీటెక్ రవి - ఎమ్మెల్సీ రాం గోపాల్ మధ్య చాలా రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీలో ఆధిపత్య పోరు పార్టీకి సమస్యగా మారింది. చంద్రబాబు పార్టీ నేతల ఘర్షణల పైన సీరియస్ అయ్యారు. ఇలాంటివి జరగటానికి వీళ్లేదని హెచ్చరించారు. ఇక, తాజాగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సాక్షిగా ఘర్షణకు నేతలు దిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.

ఓవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్ర రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు.మంత్రి జనార్దన్ రెడ్డి ఎదుటే ఇరువర్గాల నేతలు సవాళ్లు విసురుకొని దూషించుకున్నారు. ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకుని మంత్రి జనార్దన్ రెడ్డి వెళ్లిపోయారు. ఇదే జిల్లా రైల్వే కోడూరులో నూ ఇదే పరిస్థితి కొనసాగింది. కొద్ది రోజులు గా అసంతృప్తితో ఉన్న కస్తూరి విశ్వనాథ నాయుడు వర్గం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. టిడిపి కార్యాలయం అద్దాలు ,ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రస్తుత టిడిపి ఇన్చార్జ్ ఒక్కరూపానంద రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని సీనియర్ టిడిపి నేత కస్తూరి విశ్వనాథ్ నాయుడు వర్గం ఆరోపణ లు చేస్తోంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో, ఈ వరుస ఘటనల తో పార్టీ నాయకత్వం ఎలాంటి కార్యాచరణ సిద్దం చేస్తుందనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications