మొరటోడికి మొగలిపువ్వు ఇచ్చినట్టుంది: జగన్‌పై దివ్యవాణి ఫైర్: కొడాలి నాని..సన్నబియ్యం సోగ్గాడు
అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై చోటు చేసుకున్న దాడి ఘటనపై చెలరేగిన రాజకీయ దుమారం చల్లారట్లేదు. టీడీపీ నాయకులు ఈ రెండు అంశాల గురించి వంతులవారీగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఘాటు పదాలతో విరుచుకుపడుతున్నారు. నిన్నటికి నిన్న పార్టీ నాయకురాలు పంచుమర్తి అనూరాధ ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా.. తాజాగా దివ్య వాణి ఆ బాధ్యతలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలపై పలు విమర్శలు చేశారు.

మొరటోడికి మొగలిపువ్వు ఇచ్చినట్టు..
151 మంది శాసనసభ్యులతో రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌కు అధికారాన్ని అందించితే.. ఎలా పరిపాలించాలో ఆయనకు తెలియట్లేదని దివ్యవాణి విమర్శించారు. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే ఎలా ఉంటుందో. పరిపాలన అలాగే ఉందని అన్నారు. పాలన రానటువంటి వ్యక్తికి ప్రజలు అధికారాన్ని అందించారని ధ్వజమెత్తారు. డోర్ డెలివరీ వాహనాల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సన్నబియ్యం సోగ్గాడిలా తయారయ్యారని ఎద్దేవా చేశారు.

బియ్యం డోర్ డెలివరి చెత్త పథకం
తెల్లరేషన కార్డుదారులకు బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి ఉద్దేశించిన పథకం గురించి దివ్యవాణి ఘాటుగా విమర్శించారు. అదో చెత్త పథకం అని మండిపడ్డారు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బియ్యం బండ్లను తాము నడిపించలేమంటూ డ్రైవర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ పథకం పేరుతో వందల కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే దమ్ము సంబంధిత శాఖ మంత్రి కొడాలి నానికి ఉందా అని ఆమె సవాల్ విసిరారు.

అక్రమాలు బయటపెడుతున్నందుకే..
జగన్ పాలనలోని అవినీతిని పక్కా సాక్ష్యాధారాలతో సహా వెలికి తీస్తున్నందుకే తమ పార్టీ నేత పట్టాభిపై వైసీపీ నేతలు దాడులు చేయించారని దివ్యవాణి ఆరోపించారు. నిమ్మాడలో వైసీపీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయదలిచిన కింజరాపు అప్పన్న.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడేనని, ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తారా? అని దివ్యవాణి ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుడికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారనే విషయం ఆడియో రికార్డుల్లో తేలిందని అన్నారు. అచ్చెన్నను ఉద్దేశపూరకంగా అరెస్టు చేశారని, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా కోసం మూడు సింహాల్లా..
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ లోక్‌సభ సభ్యులు ముగ్గురు మూడు సింహాల్లా పోరాడుతున్నారని దివ్యవాణి అన్నారు. ప్రత్యేక హోదా కోసం వారంతా ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిశారని, 28 మంది మంది ఎంపీలు ఉన్న వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ నేతలు కేంద్రం వద్ద తల ఎత్తడానికి కూడా భయపడుతున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో దాడులకు పాల్పడుతూ, ఏకగ్రీవాల పేరుతో దౌర్జన్యాలను ప్రోత్సహిస్తోన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండో బిహార్‌లా మార్చుతోందని దివ్యవాణి ఆందోళన వ్యక్తం చేశారు.