విశాఖలో టీడీపీ నేతపై బాంబులతో దాడి, తీవ్ర గాయాలు
విశాఖపట్నం: విశాఖ డెయిరీ డైరెక్టర్, టీడీపీ మండల నాయకుడు గేదెల సత్యనారాయణపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నాటు బాంబులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే... ఆదివారం విశాఖ జిల్లా బుచ్చియ్యపేట మండలం కోమర్లపూడి గ్రామంలో జరిగిన టీడీపీ సమావేశానికి సత్యనారాయణ హాజరయ్యారు.
అనంతరం పల్లెల్లో చేపట్టాల్సిన ఏరువాక పనుల్లో భాగంగా మండలంలోని గంటికొర్లాం పెద్దగొట్టు చెరువు వద్ద పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని దుండుగులు ఒక్కసారిగా నాటు బాంబులు వేసి అక్కడ నుంచి పరారయ్యారు.
బాంబులు పేలినప్పుడు పైకి లేచిన ఇనుప ముక్కలు సత్యనారాయణ శరీరంలోకి గుచ్చుకుపోయాయి. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను స్థానికులు రావికమతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి విషయం తెలుసుకున్న చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు హూటాహుటిన రావికమతం చేరుకొని సత్యనారాయణను తన కారులో విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

దాడిలో గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. కాగా, సత్యనారాయణపై దాడికి కారణం రాజకీయాలా? లేక వ్యక్తిగత కక్షలా? అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని బుచ్చియ్యపేట ఎస్‌ఐ ధనుంజయ్ తెలిపారు.
ఇదిలా ఉంటే విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటిసారిగా నాటుబాంబులను ఉపయోగించి ఈ తరహా దాడులు జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications