మున్సిపల్ పోరులో వైసీపీ విజయంపై జేసీ ఆసక్తికర వ్యాఖలు-అధికారుల స్వామిభక్తికి థ్యాంక్స్
ఏపీలో తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు సాధించడంపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ వరుస విజయాల వెనుక రహస్యాన్ని కూడా ప్రభాకర్ రెడ్డి బయటపెట్టారు ఇందుకు కారణమైన వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే జేసీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో మరొకసారి స్వామి భక్తి నిరూపించుకున్న అధికారులంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరొకమారు ప్రభుత్వ అధికారులు తమ స్వామి భక్తిని నిరూపించుకున్నారని, వైస్సార్సీపీ పార్టీ నేడు గెలిచింది అంటే అది కేవలం ప్రభుత్వ అధికారుల స్వామి భక్తి మాత్రమే అన్నది జగమెరిగిన సత్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పాపం ప్రభుత్వ అధికారులు పరిపరి విధాలుగా తమ స్వామిభక్తి నిరూపించుకున్నా వారికి ప్రభుత్వం నుంచీ అందాల్సిన ప్రయోజనాలు అందకపోవడం శోచనీయమంటూ మరో సెటైర్ కూా వేశారు.

మొత్తానికి ఎన్నికలను స్వామిభక్తి తో ముగించిన అధికారులందరికీ ధన్యవాదాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీడీపీ కేవలం ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని మాత్రమే గెల్చుకోగలిగింది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో సైతం టీడీపీ కేవలం తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే దక్కించుకుంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్ అయ్యారు. గతంలోనూ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ.. ఇవాళ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయాంశమవుతోంది. జేసీ ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ కూడా కుప్పంతో పాటు రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో అధికారులు వైసీపీ చెప్పినట్లు విని తమను ఇబ్బందిపెడుతున్నారని ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో జేసీ కూడా అవే వ్యాఖ్యలు చేశారు.