టీడీపీకి సీనియర్ నేత గుడ్‌బై: జగన్ సమక్షంలో వైసీపీ కండువా
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాచర్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఇన్‌ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకొన్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కొమ్మారెడ్డి. స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. 3,535 ఓట్ల తేడాతో ఆయనపై ఘన విజయం సాధించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. అయిదోసారి పిన్నెల్లి ఈ నియోజకవర్గం నుంచి విజయఢంకా మోగించారు.

2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి కొమ్మారెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులుగా అన్నపురెడ్డి అంజిరెడ్డిని బరిలోకి దిగింది గానీ.. సేమ్ రిజల్ట్ వచ్చింది. ఈ సారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెజారిటీ భారీగా పెరిగింది. సుమారు 23 వేల ఓట్ల తేడాతో అంజిరెడ్డిని ఓడించారు.
2024లో జూలకంటి బ్రహ్మానందరెడ్డికి మాచర్ల నియోజకవర్గం టికెట్ దాదాపు ఖరారైనట్టేననే ప్రచారం పల్నాడు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొమ్మారెడ్డి చలమారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా కండువాను కప్పి ఆయనకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. చలమారెడ్డితో పాటు టీడీపీ స్ధానిక నాయకులు కే శ్రీనివాసరెడ్డి, కే రామచంద్రారెడ్డి, కే వెంకటేశ్వరరెడ్డి, కే షణ్ముఖ్ రెడ్డి, వీ శంకర్.. వైఎస్ఆర్సీపీలో చేరారు. వారి వెంట ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఉన్నారు.












Click it and Unblock the Notifications