Nara Lokesh500 : 500 కిలోమీటర్లు దాటిన నారా లోకేష్ పాదయాత్ర-మదనపల్లెలో శిలాఫలకం..
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర ఇవాళ మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది.
మదనపల్లి : టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh).. వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా యువగళం పాదయాత్ర చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో కుప్పంలో ప్రారంభించిన ఈ యాత్ర ఇవాళ 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో లోకేష్ ఈ మైలురాయిని అధిగమించారు.
నారా లోకేష్ పాదయాత్ర ఇవాళ మదనపల్లె నియోజకవర్గంలో ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నతిప్ప సముద్రం వద్ద లోకేష్ 500 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా స్ధానికంగా టమోటా రైతులకు ఆయన ఓ హామీ ఇచ్చారు. అలాగే ఈ మైలురాయి గుర్తుండిపోయేలా ఓ శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

లోకేష్ తన పాదయాత్ర 500 కి.మీ.దాటిన సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ మేరకు హామీలు అమలు చేస్తామని రైతులకు తెలిపారు. ఈ హామీకి గుర్తుగా శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. దీంతో స్ధానిక టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.













Click it and Unblock the Notifications